నెలసరి సమయంలో చాలామంది మహిళలు నొప్పి, అలసట, కడుపు ఉబ్బరం, మూడ్ మార్పులు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజుల్లో జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి కారణంగా ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే నెలసరి నొప్పిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. మందులు తీసుకోకుండా ఇంట్లో లభించే ఆహార పదార్థాలతోనే ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వైద్య నిపుణుల మాట ప్రకారం నెలసరి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందితే నొప్పి తీవ్రత తగ్గుతుంది, శరీరం తేలికగా అనిపిస్తుంది.
మెంతి ఆకులు, తోటకూర
నెలసరి సమయంలో రక్తస్రావం జరుగుతుండటంతో శరీరంలో ఐరన్ స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల అలసట, నీరసం కనిపిస్తాయి. అందుకే ఆకుకూరలు ఈ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పాలకూర, మెంతి ఆకులు, తోటకూర వంటి ఆకుకూరలు తినడం వల్ల ఐరన్ అందుతుంది. ఇది శరీర బలాన్ని పెంచుతుంది. ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ కూరలను తేలికగా వండుకుని తింటే జీర్ణ సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. సూప్ రూపంలో తీసుకున్నా శరీరానికి మేలు కలుగుతుంది.
నెలసరి నొప్పి ఎక్కువగా ఉన్న మహిళలకు అరటిపండ్లు చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అల్లం కూడా నెలసరి నొప్పిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. అల్లంతో చేసిన టీ తాగితే కడుపు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అల్లం శరీరంలో వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
దోసకాయ, పుచ్చకాయ
నెలసరి సమయంలో నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినడం చాలా అవసరం. దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లు శరీరానికి తేమను అందిస్తాయి. దీని వల్ల కడుపులో భారంగా అనిపించే భావన తగ్గుతుంది. నీరు తక్కువగా తాగితే తలనొప్పి, అలసట పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రోజంతా సరిపడా నీరు తాగాలి. ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి సంపూర్ణ ధాన్యాలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంలో ఉంచుతాయి. నెలసరి సమయంలో వచ్చే ఆకలి సమస్యను కూడా నియంత్రించడంలో సహాయపడతాయి.
నెలసరి నొప్పి తగ్గించడంలో చేపలు కూడా మంచి పాత్ర పోషిస్తాయి అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటి ఆసిడ్స్ నొప్పిని తగ్గించే గుణం కలిగి ఉంటాయి. చేపలు తినని మహిళలు అవిసె గింజలు తీసుకోవచ్చు. ఇవి కూడా నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఉపయోగపడతాయి. నెలసరి సమయంలో మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం, బయట ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకోవడం మంచిది. ఇంట్లో వండిన తేలికపాటి ఆహారం తీసుకుంటే శరీరం ప్రశాంతంగా ఉంటుంది. సరైన ఆహారం, సరైన విశ్రాంతి పాటిస్తే నెలసరి నొప్పిని చాలా వరకు నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు మహిళల జీవనాన్ని సులువుగా మారుస్తాయి.