Migraine Triggers: మైగ్రేన్ అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య. ఇది కేవలం తల ఒక వైపున వచ్చే నొప్పి మాత్రమే కాదు, వాంతులు, వికారం, వెలుతురును చూడలేకపోవడం వంటి ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. చాలా మందిలో మైగ్రేన్ అకస్మాత్తుగా వస్తుంది. కానీ నిశితంగా గమనిస్తే మన రోజువారీ అలవాట్లలోనే దానిని ప్రేరేపించే ‘ట్రిగ్గర్స్’ దాగి ఉంటాయి. ఈ ట్రిగ్గర్స్ ఏంటో తెలుసుకుంటే. నొప్పి తీవ్రతను తగ్గించుకోవడమే కాకుండా.. అది రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. ఆ 10 ప్రధాన కారణాలు, పరిష్కారాలు ఇప్పుడు చూద్దాం.
మైగ్రేన్‌ను ప్రేరేపించే 10 ప్రధాన కారణాలు:
మైగ్రేన్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అయితే మెజారిటీ ప్రజలలో నొప్పిని కలిగించే సాధారణ అంశాలు ఇవే..
1. మానసిక ఒత్తిడి:
ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో వచ్చే ఒత్తిడి మైగ్రేన్‌కు అతిపెద్ద శత్రువు. మనం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఇవి రక్తనాళాల్లో మార్పులు తెచ్చి మైగ్రేన్‌కు దారితీస్తాయి.
పరిష్కారం: యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.
2. నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం:
క్రమబద్ధమైన నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోతుంది. కేవలం నిద్ర తక్కువవ్వడమే కాదు, సెలవు రోజుల్లో అతిగా నిద్రపోయినా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది.
పరిష్కారం: ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం, కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
3. ఆహారపు అలవాట్లు:
కొన్ని రకాల ఆహార పదార్థాలు మైగ్రేన్‌ను పెంచుతాయి. ముఖ్యంగా నిల్వ ఉంచిన మాంసం , పాత చీజ్, అజినోమోటో ఉన్న చైనీస్ ఆహారం నొప్పిని ప్రేరేపిస్తాయి.
పరిష్కారం: తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. మైగ్రేన్ డైరీని మెయింటైన్ చేసి.. ఏ ఆహారం తింటే నొప్పి వస్తుందో గమనించాలి.
4. కెఫిన్ , ఆల్కహాల్:
అధికంగా కాఫీ తాగడం లేదా ఆకస్మాత్తుగా కాఫీ మానేయడం కూడా మైగ్రేన్‌కు కారణమవుతుంది. అలాగే రెడ్ వైన్ వంటి ఆల్కహాల్ డ్రింక్స్ తలనొప్పిని పెంచుతాయి.
పరిష్కారం: కెఫిన్ వాడకాన్ని పరిమితం చేయాలి.
5. హార్మోన్ల మార్పులు :
మహిళల్లో రుతుక్రమ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం 60% ఎక్కువగా ఉంటుంది.
పరిష్కారం: హార్మోన్ల మార్పుల వల్ల నొప్పి వస్తుంటే డాక్టర్‌ని సంప్రదించి తగిన మందులు వాడాలి.
6. వాతావరణ మార్పులు:
తీవ్రమైన ఎండ, తేమ పెరగడం లేదా అకస్మాత్తుగా వాతావరణం చల్లబడడం వల్ల మైగ్రేన్ రోగుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది.
పరిష్కారం: ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు లేదా సన్ గ్లాసెస్ వాడాలి.
7. తీవ్రమైన వెలుతురు, శబ్దాలు:
కంప్యూటర్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్, ఫ్లాష్ లైట్లు , సినిమా థియేటర్లలో వచ్చే పెద్ద శబ్దాలు మెదడును చికాకు పెడతాయి.
పరిష్కారం: స్క్రీన్ టైమ్ తగ్గించడం, అవసరమైతే ఇయర్ ప్లగ్స్ వాడటం మంచిది.
8. శరీరంలో నీటి శాతం తగ్గడం:
నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్త ప్రసరణలో మార్పులు వచ్చి మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ తగ్గుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది.
పరిష్కారం: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
9. భోజనం మానేయడం:
చాలా సేపు ఆకలితో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar) పడిపోతాయి. ఇది మైగ్రేన్‌ను త్వరగా ప్రేరేపిస్తుంది.
పరిష్కారం: సరైన సమయానికి భోజనం చేయాలి. మధ్యమధ్యలో హెల్తీ స్నాక్స్ తీసుకోవాలి.
10. గాఢమైన వాసనలు:
పర్ఫ్యూమ్‌లు, పెయింట్ వాసన, సిగరెట్ పొగ లేదా కొన్ని రకాల పూల వాసనలు మైగ్రేన్ బాధితులకు నొప్పిని కలిగిస్తాయి.
పరిష్కారం: గాఢమైన వాసనలకు దూరంగా ఉండాలి.
మైగ్రేన్‌ను పూర్తిగా నయం చేయడం కష్టమైనా.. దానిని నియంత్రించడం మన చేతుల్లోనే ఉంది. పైన చెప్పిన ట్రిగ్గర్స్‌ను గుర్తించి, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించడం బెస్ట్.