నేటి జీవనశైలిలో ఒత్తిడి, అలసట, శారీరక సమస్యలు సాధారణమైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంచడానికి యోగా మంచి మార్గం. అయితే ఇప్పుడు సాధారణ యోగాతో పాటు హాట్ యోగా అనే కొత్త తరహా యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది సాధారణ యోగా కంటే కొంచెం భిన్నం. హాట్ యోగా అనేది ఒక ప్రత్యేక యోగా పద్ధతి. ఇందులో యోగా చేయడానికి గది ఉష్ణోగ్రత సుమారు 35 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. వేడి వాతావరణంలో యోగా చేయడమే హాట్ యోగా. ఈ వేడి కారణంగా శరీరంలో చెమట ఎక్కువగా వస్తుంది, ఇది టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
ఎప్పుడు మొదలైంది?
హాట్ యోగా పద్ధతి మొదటగా జపాన్‌కి చెందిన యోగా గురువు బిక్రమ్ చౌదరి కనిపెట్టారు. అందుకే దీన్ని బిక్రమ్ యోగా అని కూడా పిలుస్తారు. సాధారణంగా 26 రకాల యోగా ఆసనాలు, 2 ప్రాణాయామాలు ఈ యోగాలో ఉంటాయి. ప్రతి ఆసనం వేడి గదిలోనే చేయాలి. హాట్ యోగా సాధారణంగా 60 నుంచి 90 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభంలో తేలికపాటి ఆసనాలతో మొదలు పెట్టి, క్రమంగా కఠినమైన ఆసనాలకు వెళ్తారు. వేడి వాతావరణంలో శరీర కండరాలు త్వరగా సాగుతాయి. కాబట్టి స్ట్రెచింగ్ సులభమవుతుంది.
హాట్ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు
వేడి కారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. దీని ద్వారా శరీరంలోని హానికర పదార్థాలు బయటకు వెళ్తాయి. ఇది చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా ఉంచుతుంది. వేడి వాతావరణంలో యోగా చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. దాంతో క్యాలరీలు వేగంగా దహనం అవుతాయి. క్రమంగా చేస్తే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేడి వాతావరణం రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. ఇది గుండె, మెదడు, కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అందేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలో శక్తి పెరుగుతుంది. యోగా అంటే కేవలం శరీర వ్యాయామం కాదు, మనసును ప్రశాంతంగా ఉంచే సాధన కూడా. హాట్ యోగా ద్వారా శ్వాస నియంత్రణ, ధ్యానం కలిపి మనసులోని ఒత్తిడి తగ్గుతుంది. వేడి వాతావరణం జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. హాట్ యోగా క్రమంగా చేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. ముఖంపై ఉన్న చెమట ద్వారా రంధ్రాలు శుభ్రపడతాయి. దీని వల్ల చర్మం మెరిసిపోతుంది, మొటిమలు తగ్గుతాయి.
హాట్ యోగా చేసే ముందు జాగ్రత్తలు
ఈ యోగా ప్రారంభించే ముందు వైద్యుడి సలహా తప్పనిసరి. ముఖ్యంగా గుండె, రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా చేసే ముందు, తర్వాత తగినంత నీరు తాగాలి. నీరు తక్కువైతే డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఖాళీ పొట్టతో ఈ యోగా చేయడం మంచిది. భోజనం చేసిన కనీసం రెండు గంటల తర్వాత చేయాలి. మొదటిసారి చేసే వారు చిన్న సమయంతో ప్రారంభించి, క్రమంగా సమయం పెంచాలి. యోగా గది సరైన గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.
ఎవరు చేయకూడదు?
హాట్ యోగాను కొంతమంది చేయకూడదు. గర్భిణీ స్త్రీలు, హై బీపీ ఉన్నవారు, గుండె వ్యాధిగ్రస్తులు లేదా శరీరంలో నీరు తక్కువగా ఉన్నవారు ఈ యోగా చేయకూడదు. అలాగే వయసు పైబడిన వారు లేదా వేడి తట్టుకోలేని వారు కూడా వైద్యుడి సలహా లేకుండా చేయకూడదు.