నేటి వేగవంతమైన జీవితంలో ఎక్కువ మంది స్నేహితులతో కలిసిమెలిసి ఉండేవారే సంతోషంగా ఉంటారని అందరూ భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం ఒకేలా ఉండదు. కొంతమంది ఒంటరిగా ప్రశాంతంగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పుస్తకాలు చదవడం, అన్ని విషయాలు లోతుగా ఆలోచించడం, అధ్యయనం చేయడం లేదా తమతో తాము సమయం గడపడం ఇష్టపడతారు. అలాంటి వారిని చాలామంది అంతర్ముఖులు, అహంకారులు లేదా బాధలో ఉన్నవారిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ సైకాలజీలో ఒంటరిగా ఉండే వారి గురించి మరోలా చెబుతోంది.
ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడే వారు తమ సంతోషం కోసం ఇతరులపై ఆధారపడరు. వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వయంగా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా పరిష్కారాలను వెతుకుతారు. ఈ స్వతంత్ర స్వభావం వారిని మానసికంగా మరింత బలంగా మారుస్తుంది. జీవిత అనుభవాల ద్వారా వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు.
ఒంటరిగా గడిపే సమయం తమను తాము అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తమ బలాలు, బలహీనతలు ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇతరులను అనుకరించకుండా తమ విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమ భావోద్వేగాలను నియంత్రించడంలో కూడా వీరు నైపుణ్యం చూపిస్తారు. ఈ లక్షణం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి ఉపయోగపడుతుంది.
ఒంటరిగా ఉండే వారు సమయాన్ని చాలా విలువైనదిగా చూస్తారు. అవసరం లేని పనులకు లేదా ప్రయోజనం లేని చర్చలకు దూరంగా ఉంటారు. ఖాళీ సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి వినియోగిస్తారు. కొందరు పుస్తకాలు చదువుతారు. మరికొందరు రచనలు, పెయింటింగ్ లేదా ఇతర అభిరుచులకు సమయం కేటాయిస్తారు. ఈ అలవాట్లు వారి వ్యక్తిత్వాన్ని మరింత అభివృద్ధి చేస్తాయి.
ఒంటరిగా ఉండే వారికి స్నేహితులు ఉండరని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వీరు ఎక్కువ మంది స్నేహితుల కంటే నిజాయితీ గల కొద్దిమందిని మాత్రమే ఎంచుకుంటారు. వారి స్నేహం నమ్మకంతో ఉంటుంది. సుఖంలోనూ, కష్టంలోనూ తమ స్నేహితులకు అండగా నిలుస్తారు. అందుకే వారి స్నేహాలు ఎక్కువకాలం కొనసాగుతాయి.
Also Read: రూపం చూసి ప్రేమ కలుగుతుందా లేక మనసు చూసి పుడుతుందా? నిజం చేదుగా ఉంటుంది
ప్రశాంత వాతావరణంలో గడపడం వల్ల వీరి మనసు స్పష్టంగా ఉంటుంది. అనవసర ఒత్తిడికి దూరంగా ఉంటారు. ఈ ప్రశాంతత కొత్త ఆలోచనలకు దారి తీస్తుంది. చాలామంది రచన, సంగీతం, పెయింటింగ్, పరిశోధన లేదా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపిస్తారు. ఏ పనినైనా ఏకాగ్రతతో పూర్తి చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.
ఒంటరిగా ఉండటం అంటే ఇతరులను ఇష్టపడరని అర్థం కాదు. అది కేవలం వారి వ్యక్తిత్వంలో భాగం మాత్రమే. సైకాలజీ ప్రకారం అలాంటి వారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకుంటారు. సృజనాత్మకత, ఆత్మపరిశీలన, నిజమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రశాంతమైన మనసు, స్పష్టమైన లక్ష్యం వారి జీవిత విజయానికి బలమైన ఆధారంగా నిలుస్తాయి.