Snakes in house| పాములు విషపూరితమైనవి కావడంతో వాటిని చూసి మనుషులు సాధారణంగా భయపడతారు. అయితే మనుషులను చూసి పాము సహా ఇతర జంతువులు కూడా భయపడతాయి. అందుకే మనుషులు నివసించే ప్రాంతాల్లో సాధారణంగా అవి రావు. కానీ కొన్ని సందర్భాల్లో పాములు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో ఇళ్లలోకి దూరిన సందర్భాలున్నాయి. ఇంట్లో పాము దూరితే దాని కాటు వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో అందరూ భయపడిపోతారు. అయితే ఈ సమస్యకు కారణమేంటో ముందు తెలుసుకోవాలి.
పాటు ఇంట్లోకి రావడానికి ముఖ్య కారణం ఆహారం. ఎలుకలు, కప్పలు, బల్లులు వంటి చిన్న జంతువులను పాములు ఆహారంగా తింటాయి. మీ ఇంట్లో లేదా దగ్గరలో ఇవి ఉంటే, పాములు వాటి కోసం వెతుకుతూ వస్తాయి. మరీ ముఖ్యంగా ఎలుకల సమస్య ఉన్న చోట పాములు ఎక్కువగా కనిపిస్తాయి.
పాములు నిశ్శబ్దంగా, దాగి ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. ఇళ్లలో చెత్త, కట్టెల పోగులు, గోడల పగుళ్లు, మనుషులు తక్కువగా తిరిగే ప్రదేశాలు, వినియోగంలో లేని గదులు వాటికి దాగి ఉండేందుకు మంచి ప్రదేశాలు. దట్టమైన మొక్కలు, పొదలు ఉన్న తోటలు కూడా పాములను ఆకర్షిస్తాయి.
ప్రతీజీవికి నీరు చాలా అవసరం. పాములకు కూడా అలాగే నీరు అవసరం. తేమగా, చల్లగా ఉండే ప్రదేశాలు వాటిని ఆకర్షిస్తాయి. నీరు కారుతున్న కుళాయి, నిలిచి ఉన్న నీరు, తడిగా ఉండే బాత్‌రూంలు లలో పాములు త్వరగా దూరుతాయి. ఎండాకాలంలో చల్లని ప్రదేశాల కోసం నీరు ఉన్న చోట పాములు తిరుగుతుంటాయి.
విపరీతమైన వాతావరణం కారణంగా పాములు సురక్షిత ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటాయి. వేసవిలో ఎండ తాపానికి దూరంగా ఉండటానికి పాములు ఇళ్లల్లోకి వస్తాయి. వర్షాకాలంలో లేదా వరదల సమయంలో అవి తమ నివాసాలను వదిలి పొడి ప్రదేశాలను వెతుక్కుంటూ మనుషులు నివసించే చోట వస్తాయి. ఋతుపవనాల సమయంలో పాము కదలికలు ఎక్కువగా ఉంటాయి.
చెత్త, మిగిలిన ఆహారం వల్ల కీటకాలు, ఎలుకలు పెరుగుతాయి. ఇవి పాములను ఆకర్షిస్తాయి. పెరిగిన మొక్కలు, ఆకుల పోగులు, చిందరవందరగా ఉండే ప్రదేశాలు పాములు దాగి ఉండేందుకు మంచి ప్రదేశాలు. పాములు రాకుండా ఉండటానికి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
పాములు చాలా చిన్న ఖాళీల గుండా కూడా ప్రవేశించగలవు. గోడలలో పగుళ్లు, తలుపుల దగ్గర రంధ్రాలు, పైపుల చుట్టూ ఖాళీలు వాటికి దారులవుతాయి. కాలువలు, బాత్రూమ్లు కూడా ప్రవేశ స్థానాలే. ఈ ఖాళీలను మూయడం వలన ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
చాలామంది పాములు మనుషులపై దాడి చేయడానికే వస్తాయని అనుకుంటారు. ఇది అసలు నిజం కాదు. పాములు సాధారణంగా మనుషులను తప్పించుకుంటాయి. అవి దాగి ఉండటానికే ఇష్టపడతాయి. బెదిరింపు లేదా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే అవి కాటు వేస్తాయి. ఈ విషయం తెలుసుకోవడం భయాన్ని తగ్గిస్తుంది.
ఇంటి చుట్టూ పరిశుభ్రత కాపాడుకోండి. చెత్తను తొలగించండి, ఆహారాన్ని బయట వదిలిపెట్టకండి. ఎలుకలను, కీటకాలను అదుపులో ఉంచండి. మొక్కలను కత్తిరించండి, దట్టమైన పొదలను నివారించండి. గోడలలోని పగుళ్లు, ఖాళీలను మూసివేయండి. లీకేజీ ఉన్న కుళాయిలను సరిచేయండి, నీరు నిలువ లేకుండా చూసుకోండి.
Also Read: ఇంట్లో క్లీనింగ్ సమయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం వచ్చినట్లే.. వాస్తు ప్రకారం ఈ జాగ్రత్తలు పాటించండి
ఇంట్లో పాము కనిపిస్తే, భయపడకండి. దాన్ని పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకండి. సురక్షితమైన దూరంలో ఉండండి. వెంటనే పాములు పట్టే నిపుణులు, రెస్క్యూ టీమ్‌కు కాల్ చేయండి. అన్ని పాములు విషపూరితం కావు. కానీ వాటిని నిపుణుల సహాయంతోనే పట్టుకోవడం సురక్షితం.
పాములు మనుషులను హింసించడానికి కాకుండా, తమ అవసరాల కోసమే ఇళ్లలోకి వస్తాయి. ఇంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడం ద్వారా పాములు రాకుండా నివారించవచ్చు. పాముల గురించి అవగాహన ఉంటే జాగ్రత్తలు పాటిస్తూ సుక్షితంగా ఉండండి.