Tongue Health: నాలుక కేవలం రుచులు చెప్పే అవయవం మాత్రమే కాదు.. మన శరీరం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నాలుక రంగు, నిర్మాణం, దాని మీద కనిపించే చిన్న మార్పులు కూడా శరీరంలో పోషక లోపాలు, ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు. అందుకే అప్పుడప్పుడూ అద్దం ముందు నాలుకను ఒకసారి పరిశీలించుకుంటే.. మీ ఆరోగ్యానికి ముందస్తు అలర్ట్‌ను పొందే అవకాశం ఉంటుంది.
సహజంగా గులాబి-ఎరుపు రంగులో ఉండే నాలుక మనం సాధారణ ఆరోగ్యంతో ఉన్నామనడానికి సంకేతం. కానీ నాలుక రంగు మరీ ముదురు ఎరుపుగా కనిపిస్తే మనలో విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గినట్లు భావించాలి. ఒక్కోసారి స్పైసీ ఆహారం తిన్నా, వేడి పానీయాలు తీసుకున్నా తాత్కాలికంగా రంగు మారొచ్చు. అది మళ్లీ సాధారణ స్థితికి వస్తే ఆందోళన చెందనవసరం లేదు.
నాలుకపై చిన్న చిన్న కురుపులు కనిపించడం సాధారణమే. అవి మనకు రుచిని చెప్పే టేస్ట్ బడ్సే. అయితే అవి ఒక్కసారిగా వాపు రావడం, నొప్పి కలగడం, రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు సూచిస్తుంది. మద్యం సేవించడం, పొగ తాగడం, ఒత్తిడి, గుట్కా వంటి అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
సహజంగా నాలుకపై చిన్న చిన్న గీతలు, గరుకు తత్వం ఉంటుంది. కానీ అది పూర్తిగా మృదువుగా, మెత్తగా మారి రుచి తగ్గితే ప్రధానంగా పోషకాల లోపం కారణం కావచ్చు. ముఖ్యంగా ఐరన్, B విటమిన్లు తగ్గినప్పుడు నాలుక ఈ విధంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లాలాజలం ఉత్పత్తి తగ్గి, కడుపుబ్బరం, నొప్పి, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
తరచూ నాలుకపై లేదా నోటిలో చిన్న పుండ్లు, పూత కనిపిస్తుంటే.. అది రోగనిరోధక శక్తి తగ్గిందనడానికి సంకేతం. ముఖ్యంగా మధుమేహులు, నోరు పొడిబారే వాళ్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా పునరావృతమవుతుంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. లేదంటే క్యాన్సర్‌కు సంకేతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
ఎక్కువగా పొగ తాగడం, గుట్కా నమలడం, కాఫీ-టీ తీసుకోవడం, నోటి శుభ్రత పాటించకుండా ఉండటం వల్ల నాలుకపై రోమాల్లా కనిపించే ఓ పొర ఏర్పడుతుంది. దీనిని హెయిరీ టంగ్ అంటారు. అందుకే నోటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం అవసరం. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, కెఫిన్ వాడకం తగ్గించడం వంటివి పాటిస్తే నాలుక మళ్లీ మామూలు స్థితికి వస్తుంది.
మీ నాలుక నలుపు లేదా ముదురు కాఫీ రంగులోకి మారితే అది సాధారణంగా మృతకణాలు అధికంగా పేరుకుపోయినట్లే. యాంటిబయాటిక్ మందులు, కాఫీ-టీ ఎక్కువగా తీసుకోవడం, శుభ్రత లోపించడం ఈ సమస్యకు కారణం కావచ్చు. సరైన నాలుక శుభ్రత పాటించి, కెఫిన్ తగ్గిస్తే రంగు క్రమంగా మామూలు స్థితికి వచ్చేస్తుంది.
ఒక్కోసారి నాలుక అకస్మాత్తుగా నొప్పి పెడుతుంది. స్పైసీ ఫుడ్, ఒత్తిడి, మధుమేహం వంటి కారణాలు దీనికి దారితీస్తాయి. ఒత్తిడి తగ్గించే యోగా, దీర్ఘశ్వాస, వ్యాయామం వంటి పద్ధతులు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కానీ నొప్పి ఎక్కువ రోజులు ఉంటే మాత్రం.. వైద్యులను సంప్రదించాలి. అలాగే నాలుక ఎక్కువగా మంట పెడుతుంటే.. పోషకాలు తగ్గడం లేదా మందుల దుష్ప్రభావం కారణం కావచ్చు. నోటిలోని నరాలు అత్యంత సున్నితంగా ఉన్నప్పుడూ ఈ సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు సొంత వైద్యం కాకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.