Polimera 3: కంటెంట్ బాగుంటే కాస్టింగ్ తో పని లేకుండా సంచలన విజయాలు అందుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చిన్న సినిమానే అయినప్పటికీ థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేసి సంచలన విజయం అందుకుంది. అదేదో కాదు పొలిమేర. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా పొలిమేర 2 కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న పొలిమేర 3పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తాజాగా చిత్ర బృందం పంచుకున్న ఒక బిగ్ సర్ప్రైజ్ అభిమానులలో మరింత ఆసక్తిని పెంచేసింది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ వార్తలను చిత్ర బృందం నిజం చేస్తూ అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ (Arjun Sarja) ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు.. ఈ సినిమాలోకి ఆయనకు స్వాగతం పలుకుతూ..” యాక్షన్ మీట్స్ పవర్.. సెన్సేషన్ సృష్టించే కంటెంట్ తో రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఒక వీడియోని విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో అర్జున్ ఎంట్రీ ఇస్తూనే.. విలన్ లను చితక బాదడం, నోట్లో సిగరెట్ తో చాలా వైల్డ్ లుక్ లో కనిపించడం సినిమాపై అంచనాలు పెంచేసింది.
పొలిమేర 1,2 చిత్రాలలో చేతబడి ,క్షుద్ర పూజలు, పల్లెటూరి నేపథ్యంలోని థ్రిల్లింగ్ అంశాలతో సాగిన ఈ కథలో.. ఇప్పుడు మూడవ భాగంలో ఊహించని మలుపు తీసుకోబోతున్నారు. పైగా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు అర్జున్ ఎంట్రీతో స్పష్టం అయింది.ఇప్పటికే పొలిమేర 2 భాగాలను అద్భుతంగా తెరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సోనిలి నారంగ్ ప్రజెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పొలిమేర 2 ముగింపులో మిగిలిన సస్పెన్స్ ప్రశ్నలకు ఈ మూడో భాగంలో సమాధానం దొరుకుతాయని ఆశిస్తున్న అభిమానులకు అర్జున్ రాకతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మొత్తానికైతే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ పొలిమేర 3లో అడుగుపెట్టేసారు. మరి ఈ సినిమా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
also read:నేషనల్ అవార్డు విమర్శలపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు!
అర్జున్ విషయానికొస్తే.. ఒకవైపు నటుడిగా, మరొకవైపు దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు పలువురు స్టార్ హీరోల చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. తమిళంలో అజిత్ తో కలిసి నటించిన ప్రముఖ చిత్రం విదాముయార్చి సినిమాతో ప్రేక్షకులను అలరించిన అర్జున్.. ఇటీవల తన కూతురు ఐశ్వర్యను తెలుగు తెరకు పరిచయం చేస్తూ.. సీతా పయనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రీసెంట్గా బ్లాస్ట్ సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న అర్జున్ ఇప్పుడు పొలిమేర3లో అవకాశం అందుకున్నారు.