Ali Enda Cheta Comedy:‘ఎంద చేట’ .. ఈ పదం విన్నప్పుడల్లా మన పెదాలపై నవ్వులు పూయడం సహజం. అలీకి ఒక ఊతపదం లా అయిపోయిన మాట అసలు ఎలా పుట్టింది,ఏంటి అనే ప్రశ్నలకి ఒక ఇంటర్వ్యూలో ఇలా సమాధానాలు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అలీ తన దగ్గరకు రావడానికి దివాకర్ బాబు కారణమని గుర్తుచేసుకున్నారు. అలీకి కొన్ని విచిత్రమైన టాలెంట్స్ ఉన్నాయని, ఆయన మాట్లాడే ప్రత్యేకమైన భాష ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని దివాకర్ బాబు తనకు చెప్పినట్లు బయటపెట్టారు.ఆ తర్వాత అలీ తన దగ్గరకు వచ్చి ఆ భాషలో మాట్లాడి చూపించడంతో, అందులో మంచి కామెడీ ఉందని గుర్తించినట్లు తెలిపారు.
అలా అలీ చెప్పిన ‘ఎంద చేట’ అనే పదాన్ని సినిమాల్లో ఉపయోగించాలని అనుకున్నానని ముఖ్యంగా అలీకి ఉన్న ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌ను గుర్తించి, దానికి తగ్గట్టుగా సీన్స్ డిజైన్ చేసేవాడినని చెప్పుకొచ్చారు.
‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో అదిరిపోయిన కామెడీ!
అలీ, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో ఈ కామెడీ మనల్ని కడుపుబ్బా నవ్వించిన సంగతి తెల్సిందే. అయితే ఈ సీన్ షూట్ చేసే సమయంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు ఎస్.వి. కృష్ణారెడ్డి.
అలీ, బ్రహ్మానందం తమకు చెప్పిన సందర్భానికి తగ్గట్టుగా అక్కడే కామెడీ పండిస్తుంటే, సెట్లో ఉన్నవాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారని ,ఇక కెమెరామెన్ శరత్ నవ్వును కంట్రోల్ చేసుకోలేక బయటకి వెళ్లిపోయాడని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు.అయితే కెమెరా మాత్రం రన్ అవుతుండటంతో, మిగతావాళ్లు నవ్వుతూ సీన్ కి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా జాగ్రత్తపడ్డానని కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
అలా నటీనటులు కామెడీని కంటిన్యూ చేసే వరకు కట్ చెప్పలేదని ,దాంతో అందరు ఎప్పుడు కట్ చెప్తానా అని ఎదురు చూశారని అలా సహజంగా వచ్చిన నవ్వులే ఆ సీన్ కి ప్లస్ అయ్యాయని వివరించారు.
రిహార్సల్స్ లేకుండా సింగిల్ టేక్‌లోనే
ఇక ఈ కామెడీ సీన్ కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్ చేయలేదని సన్నివేశం గురించి నటీనటులకు కొద్దిగానే చెప్పి అక్కడికక్కడే తమకు అనిపించినట్లు నటించమని చెప్పానని తెలిపారు. అలీకి తన డైలాగులు ఎలా ఉంటాయో పూర్తిగా తెలియకపోవడం,దానికి బ్రహ్మానందం రియాక్షన్స్ ఇద్దరి మధ్య న్యాచురల్ గా కుదిరిన టైమింగ్ వల్లే సీన్‌ను మరో లెవెల్ కి వెళ్లిందని కృష్ణారెడ్డి తెలిపారు.ఇక చివరకు ఈ కామెడీ బిట్‌ను సింగిల్ టేక్‌లోనే పూర్తి చేసినట్లు చెప్పారు.
సినిమా విడుదలయ్యాక అలీకి ఎదురైన సరదా అనుభవం!
ఇక ఈ సీన్ ఎంత పాపులర్ అయిందో ఇదే ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు అలీ. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమా విడుదలైన తర్వాత తనకు నిశ్చితార్థం జరిగిందని అఆ సమయంలో రాజమండ్రిలో షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఓ చిన్న పాప తనను చూసి ‘చేటగాడు.. చేటగాడు’ అని పిలిచిందని ఆనాటి రోజులని నెమరు వేసుకున్నాడు.దాంతో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి ఎంత గుర్తింపు వచ్చిందో అర్థమైందని అలీ తెలిపాడు.
‘మాయలోడు’, ‘నెంబర్ వన్’ సినిమాల్లోనూ అదే మ్యాజిక్!
‘ఎంద చేట’ కామెడీకి వచ్చిన క్రేజ్ తోనే ఆ తర్వాత ‘మాయలోడు’, ‘నెంబర్ వన్’ వంటి సినిమాల్లోనూ ఉపయోగించినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. ‘నెంబర్ వన్’ సినిమాలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తదితరుల మధ్య వచ్చే సన్నివేశంలోనూ ఈ పదాన్ని ఉపయోగించగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
అసలు ‘చేట’ అంటే ఏమిటి?
ఇన్ని రోజులు ప్రేక్షకులను నవ్వించిన ఈ పదానికి అర్థమేంటన్న ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు. మలయాళంలో ‘చేట’ అనే పదానికి ‘అన్నయ్య’ అనే అర్థం ఉందని తెలిపారు.