Telangana El Niño: మంత్రులతో సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందుబాటులో ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులతో ఎల్‌నినో ప్రభావంపై చర్చించామని 100 దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రకటించారు. ఒక ప్రకృతి విపత్తు ఎల్‌నినో. తీవ్ర ఎండలు, తాగునీటి కొరత ఏర్పడబోతుందని శాస్త్రవేత్తలు 2026 సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద విపత్తు ఎల్‌నినో. కోవిడ్ వల్ల గతంలో ప్రపంచమే స్తంభించిపోయింది. అలాంటి సంక్షోభమే ఎల్‌నినో అని అన్నారు.
భూమిపై ఉన్న ప్రతి జీవరాశిపై ఎల్‌నినో ప్రభావం ఉండబోతుంది. 1950 తర్వాత చాలా సందర్భాల్లో ఎల్‌నినో వచ్చింది. కరువుగా దాన్ని పరిగణించామని, ఈసారి వచ్చిన కరువు పెద్ద విపత్తు సూపర్ ఎల్నినోగా పరిగణిస్తున్నారని అన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించి ఒక కార్యాచరణను రూపొందించామని, ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నాంమని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సాగు, తాగునీటి కొరతతో పాటు విద్యుత్ కొరత కూడా ఏర్పడుతోంది. వానాకాలంలోనే ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. 13 లక్షల ఎకరాల్లో వరి కాకుండా ఇతర పంటలు వేశారు. 56 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. అక్టోబర్ నెలలో 15 వేల మెగావాట్లు ఉండాల్సిన విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగిందిని, అదనంగా 5 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందని అన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల పంప్సెట్లు ఆన్ అయ్యాయి. మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత అక్టోబర్‌లో ఉందని, డిప్యూటీ సీఎం భట్టి, విద్యుత్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం రేవంత్ అన్నారు. 20 వేల మూడు మెగావాట్ల విద్యుత్ వినియోగం ఈ రోజు జరిగిందని అన్నారు.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడం ద్వారా విద్యుత్ శాఖ మంత్రి, అధికారులు చిత్తశుద్ధిని చూపించారు. ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ రెండేళ్లలో ఆరు, ఏడు వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. విద్యుత్ శాఖ సమర్థవంతంగా పనిచేసి రైతులకు, ఇతర అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. మరో 20 రోజుల్లో వానాకాలం పంటలు కోతకు వస్తాయని, చేతికొచ్చిన పంట ఎండిపోకూడదన్న లక్ష్యంతో మార్కెట్లో ఏ ధరకు విద్యుత్ దొరికినా కొనుగోలు చేసి రైతులకు అందిస్తున్నామని అన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా విద్యుత్ కొరతతో ఉన్నాయి. రైతులు మనోధైర్యం కోల్పోకుండా మా ప్రభుత్వం విద్యుత్‌ను సరఫరా చేస్తోందని అన్నారు.
Also read: సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!
గృహ అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ను అందిస్తున్నామని, కృష్ణా బేసిన్లో 72 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. గోదావరి బేసిన్లో 40 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. 23 శాతం లోటు వర్షపాతం ఉందని అన్నారు. అన్ని రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయి. 24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉందన్నారు. తాగునీటికే ఈ రోజు క్లిష్టమైన పరిస్థితి ఉంది. చలికాలం ఎండాకాలంలా ఉందని, వచ్చే 8 నుంచి 10 నెలల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలనే దానిపై ఈ రోజు సమావేశంలో చర్చించామన్నారు. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఉందని నివేదికలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటను ఎండిపోనివ్వొద్దని అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు.
ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడాలి. సాగుకు నీటిని పొదుపుగా వినియోగించాలి. 460 టీఎంసీలు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం 209 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నీటిని పంటలకు ఇస్తే కేవలం నారుమళ్లకే సరిపోతాయని అన్నారు. 1947లో కరువు వచ్చినప్పుడు దేశమంతా రైతుల ముందు మోకరిల్లింది. దేశంలో ఎప్పుడు సమస్య వచ్చినా రైతులు ముందు నిలబడ్డారు. రైతాంగం ఎప్పుడూ రాజులాగానే వ్యవహరించింది. పేదలైనా రైతులు రాజులా వ్యవహరించారు. అందుకే దేశం ముందుకు పోయిందని అన్నారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాలని, దేనినైనా కొనుగోలు చేయవచ్చు. కానీ నీళ్లను కొనుక్కోలేంమని అన్నారు. అందుబాటులో ఉన్న 200 టీఎంసీల నీళ్లను పొదుపుగా వినియోగించుకోవాలి. ఈ నీటిని కేవలం తాగునీటి కోసమే వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
రైతులు పెద్ద మనసు చేసుకుని యాసంగిలో పంటలు వేయడం తగ్గించుకోవాలి. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుబారా చేయొద్దు. బండ్లు, కార్లు కడుక్కోవడానికి నీటిని వాడొద్దని అన్నారు. చుక్క చుక్కను ఆదా చేసుకోవాలి. తప్పుడు ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే నారుమడి దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు ఖాళీ అయ్యే అవకాశం ఉందని, వచ్చే సీజన్లో వరి వేయడాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని, గత ఏడాది ఈ సమయంలో 25 వేల మంది ఉపాధి హామీ పనులు చేస్తే, ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పనుల్లో పాల్గొంటున్నారు. ఉపాధి హామీ పథకంలో చెరువులు, కుంటలను ప్రాధాన్యతగా తీసుకుని మరమ్మతులు చేయాలన్నారు.
కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇచ్చే పథకాల ద్వారా రైతులను ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉదారంగా సాయం తీసుకునే అంశంపై అధికారులు నివేదికలు తయారు చేయాలని, ఓవర్‌లోడ్ వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతోంది. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కొంతమంది పైశాచిక ఆనందంతో నర్తిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను తీసుకుని, మిగిలిన రాష్ట్రాలకు తక్కువ ధరకు కేంద్రం అందించాలని సీఎం అన్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని మోదీ ఏం చేయమన్నా చేశాం. ఆ రోజు విధానాలు, జెండాలు మేం చూడలేదు. ఒకే విధానంలో ముందుకు వెళ్లాలన్న ప్రధాని అప్పీల్‌కు అనుగుణంగా ముందుకు వచ్చామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అదే స్ఫూర్తితో వ్యవహరించాలని అన్నారు.
అన్ని పార్టీలు, ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వ సూచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ప్రకృతి విపత్తును కలిసికట్టుగా నిలబడి ఎదుర్కోవాలి. అందరి సహకారం ప్రభుత్వానికి కావాలి. మీడియా సహకారం ప్రభుత్వానికి వందకు వంద శాతం అవసరం అని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి మీడియా కోసం ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామని, టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని, ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు.. అందరితో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యుత్ డిమాండ్ చాలా తీవ్రంగా ఉంది. సాగునీటి విషయంలో పొదుపు పాటించాలి. విద్యుత్‌ను పొదుపుగా వాడాలి. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అత్యంత ముఖ్యం. లేకుంటే పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశామని, పేదలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే ఆదుకోవాలన్న కార్యాచరణను రూపొందించామని సీఎం తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరిస్తామని, ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రిని, ఇతర మంత్రులను కలుస్తామని, ప్రజలను చైతన్యపరచడానికి కళాజాతాలను ఏర్పాటు చేస్తాంమన్నారు. సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాయాలి. సినీ నటుడు విజయ్ దేవరకొండ ఎల్‌నినోపై ఒక విజ్ఞప్తి చేశారు. మిగిలిన సినీ నటులు, క్రీడాకారులు, కళాకారుల సహకారం తీసుకుని వారితో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయించి అప్రమత్తం చేస్తామని అందరి సమస్య.. అందరం కలిసి విజయవంతంగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: అందరూ దద్దమ్మలే.. టీమిండియా బౌలర్లను బంగాళాఖాతంలో వేయండి !