Ananya Controversy: బాలీవుడ్ నటి అనన్యా పాండే, యువ హీరో లక్ష్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘చాంద్ మేరా దిల్’. కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం మే 22, 2026న థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఇందులో అనన్యా పాండే చేసిన ఒక డాన్స్ సీన్ మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. సాంప్రదాయ నృత్యకారులు, నెటిజన్లు ఈ సీన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also-పద్మ అవార్డులు 2026.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న ప్రముఖులు..
సినిమాలోని ఒక ప్రత్యేక సన్నివేశంలో అనన్యా పాండే భరతనాట్యం ముద్రలతో డాన్స్ చేస్తుంది. దీనికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. భారతదేశపు అత్యంత పురాతన, పవిత్రమైన భరతనాట్య నృత్య రూపాన్ని కేవలం ఒక ‘అస్తవ్యస్తమైన ప్రదర్శన’గా మార్చేశారని, ఇది క్లాసికల్ డాన్స్‌ను అవమానించడమేనని విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి అనితా రత్నం సైతం ఈ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ క్లిప్ చూస్తుంటే భరతనాట్యాన్ని ఒక తప్పుడు అవగాహనతో బందీగా ఉంచినట్లు అనిపించింది” అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక నెటిజన్లు అయితే తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తున్నారు. “క్రీస్తు పూర్వం 200 లో ప్రారంభమైన భరతనాట్యం, 2026 లో అనన్యా పాండేతో ముగిసిపోయింది” అంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే, ఇంటర్నెట్‌లో వస్తున్న విమర్శల్లో ప్రేక్షకులు ఒక ముఖ్యమైన స్క్రీన్ ప్లే పాయింట్‌ను గమనించడం లేదని ఈ వివాదాన్ని విశ్లేషించిన కథనాలు పేర్కొంటున్నాయి. సినిమాలో ఆ సీన్ ప్యూర్ భరతనాట్యం కాదు, అది ఒక ‘ఫ్యూజన్ డాన్స్’.
ఒక కాలేజీ రీయూనియన్ సందర్భంలో ఆమె సాంప్రదాయ భరతనాట్య ముద్రలతో పాటు మోడరన్ హిప్-హాప్ మరియు లాకింగ్ శైలులను కలిపి ఒక వెరైటీ ఫ్యూజన్ ప్రదర్శన ఇస్తుంది. సినిమాలో హీరో ఈ డాన్స్ చూసి ఎంతగానో ముగ్ధుడవుతాడు. కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా, కేవలం భరతనాట్యం అనుకుని విమర్శిస్తున్నారు.
Read also-Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు షాక్ ఇచ్చిన ఇందు
దర్శకుడు వివేక్ సోని తెరకెక్కించిన ఈ చిత్రంలో అనన్యా పాండే కాస్ట్యూమ్స్ పరంగా, లుక్స్ పరంగా చాలా అందంగా కనిపించినప్పటికీ, ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనేది వాస్తవం. ఆమె చేసిన భరతనాట్యం స్టెప్పులు కానీ, లేదా హిప్-హాప్ మూవ్స్ కానీ పర్ఫెక్ట్‌గా లేకపోవడంతో ఆ ఫ్యూజన్ కాన్సెప్ట్ కాస్తా అభాసుపాలైంది. అటు సాంప్రదాయ నృత్యంగానూ లేక, ఇటు పూర్తిగా ఆధునిక నృత్యంగానూ కాకుండా మధ్యలో ఉండిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే.. పాతకాలపు టీవీ సీరియల్‌ను గుర్తుచేసేలా సాగే కథ, కథనాలతో ‘చాంద్ మేరా దిల్’ విమర్శకుల నుంచి ప్రతికూల రేటింగ్‌లను మూటగట్టుకుంది.