కొందరి జాతకాలంతే. జనానికి ఏం మేలు చేయకపోయినా.. రాష్ట్రానికి పైసా ప్రయోజనం చేకూర్చకపోయినా.. కాలం కలిసి వస్తుంది. వెంకీ సినిమాలో అన్నట్టు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అన్నీ వాటంతట అవే కలిసి వచ్చి మనకు కావాల్సినవి చేసిపెడతాయని. అచ్చంగా కిషన్‌రెడ్డి పరిస్థితి కూడా అధిష్టానం వద్ద అలాగే ఉంది. ఆయన పరపతి అక్కడ పెరుగుతూ వస్తోంది తప్పిదే.. తగ్గడం లేదు. రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆయనే కీలకం. ఆయన నుంచి వచ్చే కీలక సమచారమే ఇప్పుడు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటున్నది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను చేసే క్రమం దగ్గర నుంచి మంత్రి పదవుల దాకా కిషన్ రెడ్డి మార్క్ ఉంటుంది. ఎటొచ్చి.. ఆయన వ్యవహార శైలి, ఆయన సీనియారిటీ మాత్రం ఇక్కడ పార్టీ ఎదుగుదలకు ఇంచుక మాత్రం పనిచేయదు.
అదే కాషాయదళం ఆందోళన చెందే అంశం. ఇక ఈ విషయం పక్కనబెడితే.. త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ నెలలో అది చేస్తారని కూడా అంటున్నారు. బండి సంజయ్ మంత్రి పదవి ఊడుతుందా? ఉంటుందా? అనే ఊహాగానాలూ ఆగలేదు. వాస్తవానికి బండి జోలికి వెళ్లేందుకు అధిష్టానం ఇష్టపడటం లేదు. ఇప్పటికే అతనికి అభయమిచ్చారనే ప్రచారం ఆ పార్టీలో జరుగుతున్నది. మరి కొత్తవారికి ఎవరెఎవరికి ఇస్తారు? అనేది కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి పదవుల ఆశలో ఉన్నవారిలో ధర్మపురి అర్వింద్ తో పాటు, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డీకే అరుణ ఉన్నారు.
బండి సంజయ్‌ను కొడుకు విషయంలో బర్తరఫ్ చేస్తే అది తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నాడు అర్వింద్. కానీ అతని ఆశలు అడియాశలే కానున్నాయి. ఇక రఘునందన్ గురించి అధిష్టానం సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ఈటల రాజేందర్, డీకే అరుణ ఇద్దరే ఇప్పుడు బరిలో ఉన్నారు. రెండు పదవులైతే ఇవ్వడం కష్టమే. ఇప్పటికే రాష్ట్రం నుంచి ఉన్నారు. వాస్తవంగా బండి సంజయ్ , కిషన రెడ్డి మధ్య సత్సంబంధాలు లేవు. ఆ లెక్కన ఆయనకు ఎవరితోనే సరిగా టర్మ్స్ లేవు. కానీ అధిష్టానం మాత్రం బండి విషయంలో ఓ క్లారిటీతో ఉంది. గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వల్ల పార్టీకి బాగా నష్టం జరిగిందనే అంచనాలో అధిష్టానం ఉంది.
ఇప్పుడు మళ్లీ కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తొలగిస్తే అది పార్టీకి నష్టమే మిగుల్చుతుంది తప్ప.. లాభం లేదని భావిస్తోంది. ఈ విషయంలో కిషన్‌రెడ్డి కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న బండి విషయంలో తను జోక్యం చేసుకోకపోవడమే బెటరని మిన్నకుండిపోయాడు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు కూడా.. బండి కేసు విషయంలో డిఫెన్స్ చేశాడు. అది బండి సంజయ్‌కు సంబందించిన కేసు కాదని, అతను ఏ తప్పు చేయలేదని, అతని ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి.. చట్టపరిధిలో దానికి పరిష్కారం దొరుకుతుందని ..బండికి క్లీన్ చీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు కేంద్ర మంత్రి పదవుల విషయంలో ఈటల రాజేందర్ బలంగా ఫైరవీ చేస్తున్నా.. కిషన్‌రెడ్డి దీనికి ఆటంకంగా మారుతాడా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కిషన్‌రెడ్డి అభిప్రాయమే ఈ విషయంలో తీసుకుంటే డీకే అరుణకే చాన్స్ ఇవ్వాలని చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కిషన్‌రెడ్డి మాటను పరిగణలోకి తీసుకుంటారా? ముందే ఇచ్చిన మాట ప్రకారం ఈటల రాజేందర్‌కు కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని సముచిత ప్రాధాన్యత ఇస్తారా? అనే కోణంలో అధిష్టానం ఆలోచిస్తున్నది. ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం, అతని సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. రెండు వర్గాల నుంచి పార్టీకి మరింత బలం చేకూరుతుందనే అంచనా కూడా పార్టీ గతంలో చేసింది. మరి ఇప్పుడు ఎలాంటి రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటుందో చూడాలి!