Andhra King Taluka: సినిమా కథలు ఎప్పుడు ఒరిజినల్ జీవితాలనుంచే స్ఫూర్తి పొంది వస్తూ ఉంటాయి. ప్రతి సినిమాలో కూడా బయట జరిగే ఏదో ఒక విషయం గురించి చెప్తూనే ఉంటారు డైరెక్టర్స్. ఇంకొందరు బయట జరిగే విషయాలను స్ఫూర్తిగా తీసుకొని కథలను రాస్తూ ఉంటారు. అయితే కొన్ని బయోపిక్స్ గా వస్తాయి. మరికొన్ని వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని సినిమాను తెరకెక్కిచ్చినట్లు చెప్తారు. ఇక ఈమధ్య రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
ఇక నవంబర్ 27న రిలీజ్ అవుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది.
ఈ సినిమా కోసం మునిపెన్నడు లేని విధంగా రామ్ ఎంతో కష్టపడుతున్నాడు. సాంగ్స్ పాడుతున్నాడు.. ప్రతి ఈవెంట్లో ఎప్పుడు లేని విధంగా డాన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. ఒక ఫ్యాన్ తన అభిమాన హీరో కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమాలో చూపించినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు మహేష్ బాబు రాసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక కోలీవుడ్ స్టార్ హీరోకి ఒకప్పుడు ఒక అభిమాని గొప్ప సహాయం చేశాడని, ఆ సహాయం తీసుకున్న హీరో ఫ్యాన్ కోసం ఒక అద్భుతమైన పని చేశాడని టాక్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు ఈ సినిమాను రాసుకున్నాడని వినికిడి. అయితే ఆ హీరో ఇప్పటికీ స్టార్ హీరో గానే కొనసాగుతున్నాడట. కానీ, ఈ విషయం ఎవరికీ బయట పెద్దగా తెలియదని సమాచారం. ఇక సినిమా చివర్లో ఒరిజినల్ హీరో పేరు కూడా చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఇప్పటికే ఉపేంద్ర ఒక ఇంటర్వ్యూలో అసలైన ఆంధ్రా కింగ్ తాను కానీ, రామ్ కానీ కాదు అని ఇంకెవరో ఉన్నారు అని చెప్పాడు. ఆ మాటలకు అర్దం ఒరిజినల్ హీరోని చూపించే ప్రయత్నం చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆ హీరో ఎవరు..? ఆ ఇన్సిడెంట్ ఏంటి..? అనే వివరాల గురించి నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ హీరో ఎవరు అనేది ఆటోమేటిక్ గా అభిమానులకి తెలిసిపోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు అనేది తెలియాలి అంటే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చూడాల్సిందే.