Kalyan Padala Home Tour : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా నిలిచిన కళ్యాణ్ పగడాల విజయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. ఒక సామాన్య ఆర్మీ జవాన్, మారుమూల గ్రామం నుండి వచ్చి బిగ్ బాస్ టైటిల్ గెలవడం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథ దాగి ఉంది.బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనొక సాదాసీదా జవాన్. కానీ బయటకు వచ్చేసరికి కోట్లాది మంది అభిమానాన్ని దొచుకున్న సూపర్ స్టార్. విజయనగరం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు సుందరపేట పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఇంటింటా మారుమోగుతోంది. దీనికి కారణం ఆ ఊరి బిడ్డ కళ్యాణ్ పగడాల సాధించిన అద్భుత విజయం.
పాన్ షాప్ నుండి బాక్సాఫీస్ దాకా..
కళ్యాణ్ నేపథ్యం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. ఆయన తల్లిదండ్రులు గ్రామంలో ఒక చిన్న పాన్ షాప్ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కళ్యాణ్ ఆర్మీలో దేశానికి సేవ చేస్తున్నా, ఆయన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్నే నమ్ముకుని ఆ చిన్న షాపులోనే గడుపుతున్నారు. ఇప్పటి వరకు కళ్యాణ్ ఇల్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. కానీ, ఆ పేదరికం ఆయన గెలుపుకు అడ్డుకాలేదు. కొడుకు గెలవాలని ఆ తల్లిదండ్రులు తమ షాప్ బోర్డులను కళ్యాణ్ ఫ్లెక్సీలతో కప్పివేసి చేసిన ప్రచారం ప్రతి ఒక్కరినీ కదిలించింది.
ఊరు ఊరంతా ఒక్కటే మాట
కళ్యాణ్ విజయం కేవలం ఆయన ఒక్కడిదే కాదు, సుందరపేట గ్రామస్తులందరిదీ. స్మార్ట్ ఫోన్లు వాడటం రాని ఊరి పెద్దలు, వృద్ధులు సైతం తమ పిల్లల సహాయంతో మిస్డ్ కాల్స్ ఇస్తూ ప్రతిరోజూ కళ్యాణ్‌కు ఓట్లు వేశారు. మా బిడ్డ కప్పు పట్టుకొస్తాడని రాత్రి 2 గంటల వరకు టీవీల ముందు ఎదురుచూశామని ఆ ఊరి మహిళలు భావోద్వేగంతో చెబుతున్నారు. హౌస్‌లో జవాన్‌గా క్రమశిక్షణతో ఆడుతూ, కెప్టెన్‌గా తన బాధ్యతను నెరవేర్చిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఘన స్వాగతానికి సుందరపేట ముస్తాబు
కళ్యాణ్ తిరిగి వస్తున్నాడన్న వార్తతో ఆ గ్రామం ఇప్పుడు ఒక పెళ్లి ఇల్లులా ముస్తాబైంది. విశేషమేమిటంటే.. పక్క గ్రామాల వారు సైతం కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా టెంట్లు, డెకరేషన్ పనులు చేస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీకి ఉన్నంత పేరు ఈరోజు మా ఊరి బిడ్డకు వచ్చిందని గ్రామస్థులు చెబుతుంటే కళ్యాణ్ సంపాదించుకున్న ఆస్తి ఏంటో అర్థమవుతోంది.
ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి, తన నిజాయితీతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న కళ్యాణ్ పగడాల విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తి. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని, కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు అని కళ్యాణ్ నిరూపించారు.