Chaatu Chaatu Song: పవన్ కళ్యాణ్ అనగానే అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటారేమో.. ఆయన కాదు. ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త టాలెంట్ మెరవబోతోంది. పవన్ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan Battula) హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పురుష:’ (Purushaha). కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘చాటు చాటు’ (Chaatu Chaatu Lyrical Song) అనే బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను సికింద్రాబాద్‌లోని కస్తూర్బా ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో స్టూడెంట్స్ సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. యువతను ఉర్రూతలూగించేలా, ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ ఈ పాటను డిజైన్ చేశారు. విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతోంది.
అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ‘‘చాటు చాటు చాటు నుంచి చూడడాలు దేనికో.. మాటు మాటు మాటులోనే దాచడాలు ఎందుకో’’ అంటూ సాగే పల్లవి, ఒక ప్రేమికుడి మనసులోని సంఘర్షణను, చెప్పలేక దాచుకున్న ఆశను చాలా అందంగా ఆవిష్కరించింది. సింగర్ చిన్మయి శ్రీపాద తన మధురమైన గాత్రంతో ఈ మెలోడీకి ప్రాణం పోశారు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన ట్యూన్ వినగానే ఎక్కేస్తుంది. లిరికల్ వీడియోలో చూపించిన షూటింగ్ లొకేషన్స్ చాలా నేచురల్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. హీరో పవన్ కళ్యాణ్ బత్తుల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ‘‘మేఘాలు ఆపలేవు మెరుపుకున్న తొందర.. మౌనాలు ఆగమన్నా మనసు ఆగలేదురా’’ వంటి లైన్స్ ప్రేమికుల మనసు గెలుచుకుంటున్నాయి. న్యాచురల్ లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట చూస్తుంటే సినిమాలో విజువల్స్ రిచ్‌గా ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
Also Read- Kissik Talks: చిరంజీవిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. కానీ అంత ఈజీ కాదు – యాంకర్ రవి
ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సప్తగిరి, వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి.గణేష్ వంటి సీనియర్ కమెడియన్లు ఉండటంతో సినిమాలో వినోదానికి లోటు ఉండదని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మెలోడీ సాంగ్స్ ఇష్టపడే వారికి ఈ పాట కచ్చితంగా ఫేవరెట్ సాంగ్ అవుతుంది. అందులో నో డౌట్..