Dancers Association Dispute:డాన్స్ ఇండస్ట్రీలో రాజుకున్న మంటలు ఇప్పట్లో ఆరేలా కమీపించట్లేదు.తాజాగా డాన్సర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో రఘు మాస్టర్ ప్యానెల్‌పై సుమలత చేసిన ఫిర్యాదు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి, అసోసియేషన్‌కు సంబంధించిన లావాదేవీల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందంటూ సుమలత ఆరోపించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ ఆరోపణలు బయటకు రావడంతో అసలు డాన్సర్స్ అసోసియేషన్‌లో ఏం జరుగుతోంది? అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు అంతా .విషయంలోకి వెళ్తే సుమలత ఫిర్యాదులో ప్రధానంగా బ్యాంకుకు సమర్పించిన కొన్ని పత్రాలపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అసోసియేషన్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? కార్యవర్గానికి అధికారిక గుర్తింపు ఉందా? అనే అంశాలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తుంది.అయితే ఈ ఆరోపణలను రఘు మాస్టర్ వర్గం పూర్తిగా ఖండిస్తోంది.
సుమలత ఆరోపణలకు కౌంటర్‌గా రఘు మాస్టర్ కూడా పోలీసులను ఆశ్రయించారని సమాచారం.. సుమలత కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ,తమపై ఫోర్జరీ ఆరోపణలు చేయడం సరికాదని, అసోసియేషన్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో తాము నిబంధనల ప్రకారమే ముందుకెళ్లామని రఘు మాస్టర్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ రఘు మాస్టర్ తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ అధికారికంగా గుర్తించిందని ఆయన వాదిస్తున్నారు. ఆ గుర్తింపుకు సంబంధించిన లేఖ తమ వద్ద ఉందని, అదే లేఖ ఆధారంగా బ్యాంకును సంప్రదించామని చెబుతున్నారు. తమకు ఫెడరేషన్ నుంచి వచ్చిన గుర్తింపు లేఖను బ్యాంకుకు సమర్పించిన తర్వాతే బ్యాంకు సంబంధిత ప్రక్రియకు అనుమతి ఇచ్చిందని రఘు మాస్టర్ అంటున్నట్లు సమాచారం.
అయితే ఇదే పాయింట్‌పై ఇరు వర్గాల మధ్య అసలు వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. సుమలత ప్యానెల్‌కు ఫెడరేషన్ నుంచి అధికారిక గుర్తింపు లేదని రఘు మాస్టర్ ఆరోపిస్తున్నారు. తమ ప్యానెల్‌కు గుర్తింపు ఉన్నప్పుడు, మరో వర్గం ఎలా అధికారికంగా వ్యవహరిస్తుంది? అన్నదే ఆయన వాదనగా కనిపిస్తుంది.
డాన్సర్స్ అసోసియేషన్‌లో ఇప్పటికే ఉన్న విభేదాలు ఈ తాజా పరిణామాలతో మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. సుమలత వ్యవహారం వల్ల అసోసియేషన్ పరువు పోతోందని రఘు మాస్టర్ అన్నట్టు సమాచారం.
ఇక ప్రస్తుతం రఘు మాస్టర్ మాత్రం త్వరలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని ప్రకటించినట్లు సమాచారం. తమ కార్యవర్గానికి ఫెడరేషన్ గుర్తింపు ఉందని, అందువల్ల తదుపరి దశలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంలో ఎలాంటి సమస్య ఉండదని ఆయన వర్గం ధీమాగా ఉంది.
మరోవైపు సుమలత వర్గం మాత్రం తమ అభ్యంతరాలపై చట్టపరమైన మార్గంలో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.చూడాలి ఈ వార్ లో ఎవరు పై చేయి సాధిస్తారో !