Dil Raju: టాలీవుడ్‌లో ఒక సినిమా రిజల్ట్ తేడా కొడితేనే బడ్జెట్ కంట్రోల్ చేసే నిర్మాతలున్నారు. కానీ, తన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఆశిష్ రెడ్డి విషయంలో మాత్రం నిర్మాత దిల్ రాజు ఏకంగా ‘బ్లాంక్ చెక్’ రాసేస్తున్నారు. ‘రౌడీ బాయ్స్’ ఆశించిన స్థాయిలో ఆడలేదు, ‘లవ్ మీ: ఇఫ్ యు డేర్’ అయితే బాక్సాఫీస్ వద్ద దారుణంగా కొట్టుకుపోయింది. అయినా సరే, ఆశిష్ మార్కెట్ వాల్యూతో సంబంధం లేకుండా బడ్జెట్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ‘దేత్తడి’ టీజర్ లాంచ్ చూస్తుంటే.. దిల్ రాజు గారు చేస్తున్న ఈ రిస్క్ ‘సాహసమా’ లేక ‘వారసత్వ వ్యామోహమా’ అన్న డౌట్స్ గట్టిగానే రైజ్ అవుతున్నాయ్.
ఒక్క ఎపిసోడ్ కే అంత ఖర్చా? దిల్ రాజుకి ఏమైంది?
సాధారణంగా ఒక చిన్న హీరో మీద పెట్టే బడ్జెట్‌కు ఒక పరిమితి ఉంటుంది. కానీ ‘దేత్తడి’ టీజర్ విజువల్స్ చూస్తుంటే, ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం దిల్ రాజు పెట్టిన ఖర్చు చూసి ఇండస్ట్రీ షాక్ అవుతోంది. తెలంగాణ కల్చర్‌లో భాగమైన ‘బ్యాండ్ బృందం’ నాయకుడిగా ఆశిష్‌ను ఊర మాస్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. దర్శకుడు ఆదిత్య రావు అడిగిన ప్రతిదీ కాదనకుండా సమకూర్చిన దిల్ రాజు, తన వారసుడిని ఎలాగైనా ‘మాస్ హీరో’గా నిలబెట్టాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, వరుస డిజాస్టర్లలో ఉన్న హీరోపై ఇంత భారీ కాన్వాస్ అంటే.. అది పక్కాసెల్ఫ్ గోల్ అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
బెజవాడ ప్రసన్న కుమార్ స్కెచ్.. ఆశిష్ లోని మాస్ టచ్ బయటపడుతుందా?
ఈ సినిమాకు ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తూ సూపర్ విజన్ చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా కంటెంట్ ఉంటుందని దిల్ రాజు గట్టిగా హామీ ఇస్తున్నారు. టీజర్ లాంచ్ సమయంలో వర్షం అవాంతరం కలిగించినా, లాంఛనం అయితే ముగించారు. కానీ అసలు అవాంతరం బాక్సాఫీస్ వద్ద ఎదురుకానుంది. జునైద్ కుమార్ సంగీతం, సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చినా, కేవలం విజువల్స్ చూసి జనాలు థియేటర్లకు వచ్చే రోజులు కావివి. హీరోలో ఆ ‘స్పార్క్’ లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందనేది చేదు నిజం.
సొంత ఇంటి హీరోనే నిలబెట్టలేకపోతున్నారా?
దిల్ రాజుకి కథల మీద మంచి పట్టు ఉందని పేరు. కానీ తన ఫ్యామిలీ హీరో ఆశిష్ విషయంలో మాత్రం ఆ జడ్జిమెంట్ ఎందుకు తప్పుతోందనేది అందరి ప్రశ్న. వరుసగా రెండు సినిమాలు ఫెయిల్ అయినా, మూడో సినిమాకు బడ్జెట్ తగ్గించాల్సింది పోయి, ఇంకా పెంచడం అంటే అది కేవలం ‘సొంత వారసుడిని నిలబెట్టలేకపోతున్నానేమో’ అన్న భయం నుంచి పుట్టిన మొండితనంలా కనిపిస్తోంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్‌లో ఉంచినా, ఈ సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం దిల్ రాజు గారి బ్యానర్‌కు అది కోలుకోలేని ఆర్థిక దెబ్బే అవుతుంది. మరి ఈ ‘దేత్తడి’తో అయినా ఆశిష్ నిలబడతాడా? లేక దిల్ రాజు గారి ఆశలు మరోసారి గల్లంతవుతాయా? అన్నది వేచి చూడాలి.
ఏది ఏమైనా దిల్ రాజు పట్టుదల మెచ్చుకోదగ్గదే కానీ.. మార్కెట్ లేని చోట కోట్లు కుమ్మరించడం ‘వ్యాపారం’ అనిపించుకోదు, ‘అతివిశ్వాసం’ అనిపించుకుంటుందన్న సంగతి ఈయన గారు గుర్తిస్తే మంచిది.
also read:Sreenu Vaitla Land Scam: 7.2 కోట్ల భూ కుంభకోణం..టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న శ్రీను వైట్ల !