Garividi Lakshmi:గరివిడి లక్ష్మి …ఉత్తరాంద్రలో ఈవిడ ఎంత పాపులరో చెప్పక్కర్లేదు.ఇక ఈవిడ జీవితం ఆధారంగా గరివిడి లక్ష్మి అనే సినిమా రీసెంట్ గా వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో గరివిడి లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఇలా చెప్పుకొచ్చారు.
చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణం!
తనకి చిన్నప్పటి నుంచే పాటలంటే చాలా ఇష్టమని ఇంట్లో టేప్ రికార్డర్‌లో పాటలు వినిపిస్తుంటే వాటితో పాటు తాను కూడా పాడేదానినని చెప్పుకొచ్చింది.ఇక తాను పెరిగిన ప్రాంతంలో బుర్రకథ, హరికథ, జానపద ప్రదర్శనలకు మంచి క్రేజ్ ఉండేదని,ఆ కళాకారులు ప్రదర్శనలు ఇస్తుంటే తాను ఆసక్తిగా గమనించేదానినని వాళ్లు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు దగ్గరుండి చూడాలని అనుకునేదాన్నని, కానీ చిన్నపిల్ల కావడంతో లోపలికి పంపేవారు కాదని గుర్తుచేసుకుంది.
ఇక తాను కూడా అలాంటి కళను నేర్చుకోవాలని అనుకున్నానని,ఇతరులు ప్రదర్శనలు ఇస్తుంటే వాటిని గమనిస్తూ, పాటలు ఎలా పాడుతున్నారు? ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటున్నారు? అనే విషయాలను అర్థం చేసుకునేదానినని తెలిపింది.ఆ తర్వాత గురువుగారి దగ్గర బుర్రకథ నేర్చుకున్నానని సుమారు మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు కళకు సంబంధించిన విషయాలను ఒంటబట్టించుకున్నానని తెలిపింది .ఇక్కడి నుంచే ఆమె జర్నీ మొదలైందని అయితే అప్పుడు ఉన్న సామాజిక పరిస్థితుల కారణంగా ఆడపిల్లలు స్టేజ్ మీదకు వచ్చి ప్రదర్శనలు ఇవ్వడంపై మంచి అభిప్రాయం ఉండేది కాదని,తన తల్లి కూడా మొదట్లో ఈ కళారంగంలోకి వెళ్లడాన్ని ఇష్టపడలేదని తెలిపింది.
తన పేరు చెప్పుకొని కార్యక్రమాలు..
ఇక తన జీవితంలో తనను ఎక్కువగా బాధించిన వాటిల్లో తన పేరు, పాటలను ఇతరులు ఉపయోగించుకోవడం ఒకటని వాపోయింది. తన పేరు చెప్పుకొని కొందరు కార్యక్రమాలకు వెళ్లేవారని, తాను పాడిన పాటలను తీసుకెళ్లి పాడేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తన పేరు చెప్పుకొని వేరేవారు ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు తనను ప్రశ్నించేవారని ఆమె గుర్తుచేసుకుంది. తాను చేయని పనులకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావడం బాధ కలిగించేదని బాధ పడిపోయింది.
నెలలో ఒకట్రెండు రోజులే ఇంట్లో.. రాత్రంతా స్టేజ్ మీదే!
ఇక నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం లభించేదని , మిగిలిన సమయమంతా కార్యక్రమాలతోనే గడిచిపోయేదని తెలిపింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేసుకుంది.అయితే తన తల్లి మొదట్లోఈ కళారంగాన్ని ఇష్టపడకపోయినా, తర్వాత తన ఎదుగుదలను చూసే అవకాశం వచ్చిందని . అయితే తాను పూర్తిగా స్థిరపడుతున్న సమయంలోనే తన తల్లి మరణించారని బాధ పడింది. ఇక తల్లి దూరమైన తర్వాత తనలోని ధైర్యమే తనను ముందుకు నడిపించిందని చెప్పింది.ఎవరైనా ఏమంటారో, తన గురించి ఎలాంటి అభిప్రాయంతో ఉంటారో అని భయపడుతూ జీవించలేదని తన కష్టంతో తాను బతుకుతున్నాననే నమ్మకం ఉండేదని తెలిపిండి.
తన జీవితమే సినిమాగా మారుతుందని ఊహించలేదు
క గరివిడి లక్ష్మి సినిమా గురించి మాట్లాడుతూ, తాను ఇంతగా ఎదుగుతానని ఎప్పుడూ ఊహించలేదని ఆమె చెప్పింది. తన జీవితంలో ఎదురైన బాధలు, మోసాలు, కష్టాలు గుర్తుకు వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యానని తెలిపింది. దర్శకుడు గౌరీ నాయుడు తన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను తెరపై చూపించారని, అయితే తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను సినిమాలో చూపించడం సాధ్యం కాదని కూడా అర్థం చేసుకున్నాని వివరించింది.ఇక సినిమా యూనిట్ అంతా తనను కుటుంబ సభ్యురాలిలా చూసుకున్నారని, ప్రేమగా ఆదరించారని తెలిపింది.ఏది ఏమైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థాయికి చేరిన గరివిడి లక్షి ఎంతమందికో ఆదర్శమని చెప్పకతప్పదు.