Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇక కమెడియన్ గానే కాకుండా యాంకర్ గా డాన్సర్ గా.. సింగర్ గా తనలోని టాలెంట్ ను బయటపెట్టి బుల్లితెరకు మెగాస్టార్ గా మారాడు. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విధంగా గుర్తింపు ఉన్నప్పుడే హీరోగా మారాలి అని సుధీర్ గాలోడు అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. గాలోడు మంచి హిట్ అందుకోవడంతో సుధీర్ కు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక దీంతో హీరోగా సుధీర్ సెటిల్ అయ్యాడు అని అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత సుధీర్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఇక నాలుగో సినిమా అయినా గోట్ షూటింగ్ మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోయింది. బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో డైరెక్టర్ -నిర్మాత మధ్య విభేదాలు తలెత్తి ఈ సినిమా నుంచి డైరెక్టర్ తప్పకున్నాడని సమాచారం. ఈ సినిమా ఆగిపోవడంతో సుధీర్ మళ్లీ బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అయితే గోట్ సినిమా ఆగిపోయింది అనుకుంటున్న సమయంలో చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యనే గోట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో సుధీర్ సరసన బ్యాచిలర్ భామ దివ్యభారతి నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ముందుకు రానుంది.
ఇక ఇది కాకుండా ఈ మధ్యనే సుధీర్ మరో సినిమాను పట్టాలెక్కించాడు. ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో సుధీర్ నటిస్తున్న కొత్త చిత్రం హైలెస్సో. నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివచెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ మైథిలాజికల్ కాన్సెప్ట్ తో హైలెస్సో తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసమే అక్షరాలా కోటిన్నర ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుందని సమాచారం. అయితే ఈ ఒక్క ఐటెం సాంగ్ కోసం భారీ సెట్ వేసి ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా కేవలం ఈ ఒక్క సాంగ్ కోటిన్నర సెట్టు వేశారని టాక్ నడుస్తుంది. ఈ విషయం తెలియడంతో ఏంటి సుధీర్ సినిమాకి ..అది కూడా ఒక్క ఐటెం సాంగ్ కి కోటిన్నర ఖర్చు పెట్టారా అని నెటిజెన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. నాలుగు నిమిషాలు ఉండే ఈ సాంగ్ కే ఇంత ఖర్చు అంటే మరి సినిమాకు ఎంత హ్రచు చేస్తున్నారో. పాన్ ఇండియా సినిమాగా హైలెస్సో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.