November 2025 Hits And Flops: పెద్ద హీరోలు… మీడియం సినిమాలు…స్టార్స్ రిలీజులు…ఇబ్బడి ముబ్బడి డబ్బింగులు…. కాని వీటిలో ఒక్కటంటే ఒక్క ఫ్యాక్టర్ కూడా నవంబర్ సినిమాలకి అన్ సీజన్ అన్న ట్యాగ్ ని తుడిచేయలేకపొయింది. ఒకటి రెండు కాదు… అక్షరాల ఒకటి తక్కువ నలబై సినిమాలు… కానీ వీటిలో పట్టు మని పది.. కాదు కాదు కనీసం అయిదు సినిమాలు కూడా సక్సెస్ స్టాంప్ ని వేసుకోలేకపోయాయ్. స్టార్టింగే బ్రేక్ డౌన్ అన్నట్టుగా నెల మొదటి రోజునే ఫ్లాప్ తో పలకరించాడు మన మాస్ మహరాజ్. ఈసారి అలా అవ్వద్రా అబ్బాయిలు… అంటూ ఓవర్ కాన్ ఫిడెంట్స్తో రవితేజ వదిలిన ‘మాస్ జాతర‘ జనాలు లేకుండానే సాగిపోయింది.
పైగా ఇది రవితేజకి 75వ సినిమా కావడం గమనార్హం. ఇక అదే రోజు 1990s-01 అనే ఒక సినిమా వచ్చిందని మేకర్స్ కైనా తెలుసొ లేదో. ఇక మొదటి వారమైనా నవంబర్ ని నవ్విస్తుందనుకున్నారంతా.. అయితే ఆశ పడ్డట్టుగా 7న రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో‘ తప్ప మిగతా వేవి సక్సెస్ స్టాంప్ వేసుకోలేకపొయాయి. రష్మిక లీడ్ రోల్లో చేసిన ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాధారతో పాటు ప్రేమిస్తున్న, తారకేశ్వరి, కృష్ణ లీల, డబ్బింగ్ అయి వచ్చిన ఆర్యన్, ఫీనిక్స్, డీయస్ ఈరే ఇలా బాక్సాఫీస్ బరిలో దిగిన 8 సినిమాల్లో ఏడు బోల్తా కొట్టడం మేకర్స్ కి పెద్ద షాకే. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ బాగుందని ఊదరగొట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలవకపోవడం ఆశ్చర్యమే. ఇక మొదటి వారం పోయింది. కనీసం రెండో వారమైనా నవ్విస్తుందనుకుంది టాలీవుడ్.
అలా 14న కాంత ,సంతాన ప్రాప్తిరస్తు ,జిగిరిస్,సీత ప్రయాణం కృష్ణ తో, Cమంతం, గత వైభవం,ఆట గదరా శివ, రోలు గంట సూరి , మావూరి వెంకన్న,లవ్ OTP ,గోపి గాళ్ళ గోవా ట్రిప్ అంటూ బాక్సాఫీస్ పై ఎటాక్ చేసిన 11 సినిమాల్లో ఒక్కటి కూడా గల్లా పెట్టెలు నింపని పరిస్థితి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కాసులు రాల్చలేకపోయింది. ఒక రకంగా దుల్కర్ జడ్జ్మెంట్ని కాంత ఫలితం క్వశ్చన్ చేసేదే.. ఇక మూడో వారమైనా మురిపించకపోతుందా అనుకున్న బాక్సాఫీస్ కి కాస్త ఊరటనిచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. కేవలం 3 కోట్లతో తెరకెక్కి ఈ నెల 21న థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అంచనాలని తలకిందులు చేస్తూ ఏకంగా పదిహేను కోట్లకి పైగా కొల్లగొట్టడం విశేషం.
అయితే ఆ ఊపు అప్పటి వరకే అన్నట్టుగా అదే రోజు వచ్చిన 12A రైల్వే కాలనీ, ప్రేమంటే ,పాంచ్ మినార్ ,కలవి వనం , ఇట్లు మీ ఎదవ, హ్యాపీ జర్నీ, ప్రేమలో రెండోసారి లతో పాటు డబ్ అయి వచ్చిన వచ్చిన క్షమాపణ గాద ,మఫ్టీ పోలీస్ 21 , రీరిలీజ్ అయిన కొదమ సింహం, అవారా లలో ఏ సినిమా కూడా థియేటర్స్ కి జనాలని రాబట్టలేకపోయింది. కాస్తో కూస్తో అంచనాలు ఉన్న అల్లరోడు ,ప్రామిసింగ్ హీరోగా స్టాంప్ వేసుకున్న ప్రియదర్శిలు కూడా కనీస ఒపెనింగ్స్ తెచ్చుకోలేకపోవడం టాలీవుడ్ కి పెద్ద షాకే. ఇక మ్యాజిక్ చేస్తుందనుకున్న మెగాస్టార్ ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ ల రీ రిలీజ్ ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఈ నెల క్లైమాక్స్ అయినా కాసులు కురిపిస్తుందనుకున్నారు. కారణం 27న వస్తానని రెడీ అయిన ఆంధ్రా కింగ్ తాలుక మాంచి బజ్ తెచ్చుకోవడమే.కానీ ఒపెనింగ్స్ లో ఎక్కడా అది రిప్లెక్ట్ కాలేకపోయింది.
అభిమాని పై వచ్చిన ఈ సినిమాకి అబిమానులే లేరంటే రాపో ఎంతగా డిసప్పాయింట్ చేశాడో అర్థమయిపోతుంది.ఒక రకంగా ఈ సినిమా రామ్ కి పెద్ద గుణపాటమే.ఇక స్టార్ హీరోనే హ్యండ్ ఇచ్చాడు మాదేముంది అంటూ ఒక రోజు లేటుగా అంటే 28 న వచ్చిన స్కూల్ లైఫ్ ,జనతా బార్ ,మరువ తరమా, ఖైదు జనం తారలతో పాటుగా కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేసిన రివాల్వర్ రీటా కూడా మేకర్స్ ని నిండా ముంచేశాయ్. ఓవరాల్ గా చూస్తే చిన్న సినిమాలుగా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తప్ప మిగతా 37 సినిమాలు డిస్టిబ్యూటర్లని నట్టేట ముంచినవే.అది కూడా అలా ఇలాకాదండోయ్… ఏకంగా దాదాపు రూ. 150 కోట్లల్లో రూ. 120 కోట్లు గాల్లో కలిసిపోయేంత. అందుకే కాబోలు నవంబర్ సినిమాలకి అచ్చి రాదనేది. చూడాలి మరి ఈ డిసెంబర్ అయినా తెలుగు సినిమాకి కళని తెస్తుందో లేదో!