Jabardasth Comedian : బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ‘జబర్దస్త్’ షో ఎంతోమంది సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చింది. ఆ వేదిక ద్వారా ఆర్టిస్ట్ నుంచి టీమ్ లీడర్ వరకు ఎదిగి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిధర్ ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి చంద్రకళను ఆయన వివాహం చేసుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం..
ఆరేళ్ల ప్రేమ మహిధర్, చంద్రకళలది స్వచ్ఛమైన ప్రేమ వివాహం. వీరిద్దరి పరిచయం ఒక సినిమా కథను తలపిస్తుంది. చంద్రకళ ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న సమయంలో మహిధర్ యూట్యూబ్ వీడియోలకు సబ్‌స్క్రైబర్‌గా ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంపిన అభినందన సందేశంతో మొదలైన వీరి పరిచయం, 2019 నాటికి ప్రేమగా మారింది. సుమారు ఆరేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట, పెద్దల అంగీకారంతో తాజాగా వైజాగ్‌లో పెళ్లి పీటలెక్కారు.
రైటర్ నుంచి రివ్యూయర్ వరకు..
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక మహిధర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి బిగ్ బాస్ రివ్యూలు, సినిమా విశ్లేషణలతో భారీ వ్యూస్ సాధిస్తున్నాడు. కమెడియన్‌గానే కాకుండా మంచి రైటర్‌గా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే, కేఫ్ బిజినెస్ కూడా రన్ చేస్తున్న మహిధర్.. ఇప్పుడు చంద్రకళను వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్‌లోనూ సక్సెస్ అయ్యాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
మహిధర్ భార్య చంద్రకళ తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా జరిగిన వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు కొందరు సన్నిహితులు హాజరయ్యారు. మహిధర్ పెళ్లి ఫోటోలు చూసిన పలువురు జబర్దస్త్ నటులు, బుల్లితెర ప్రముఖులు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.