Aishwarya Cannes: క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ లుక్స్, ఆమె బరువుపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్యకు మద్దతుగా నిలుస్తూ ట్రోలర్స్‌కు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫ్యాషన్ అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని, ప్రజల అంచనాలకు తగ్గట్టుగా మహిళలు ప్రవర్తించాల్సిన అవసరం లేదని కంగనా స్పష్టం చేశారు.
కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఐశ్వర్యా రాయ్ క్యాన్స్ ఫొటోను షేర్ చేస్తూ.. “ఫ్యాషన్, స్టైల్ అనేవి ఒకరి స్వీయ వ్యక్తీకరణ. ఇది జీవితం పట్ల, వారి వైఖరి పట్ల వారికున్న వ్యక్తిగత అవగాహన. ఏ మహిళా ఎవరికీ ఏమీ బాకీ లేదు. ఐశ్వర్య చాలా అద్భుతంగా కనిపిస్తోంది” అని కొనియాడారు. అంతేకాకుండా, విమర్శలు చేసేవారికి సవాల్ విసురుతూ, “ఆమెను వేరే విధంగా చూడాలనుకునే వారు, మొదట మీరేంటో నిరూపించుకోండి. ఆమె మిమ్మల్ని మెప్పించడానికి ఇక్కడ లేదు. ఆమె ఎప్పటికీ వైభవంగానే ఉంటుంది” అని రాసుకొచ్చారు.
రెడ్ కార్పెట్ ఈవెంట్లలో పెద్ద వయసు మహిళలపై వస్తున్న విమర్శలను కంగనా తప్పుబట్టారు. వయసు పెరిగిన మహిళలను రెడ్ కార్పెట్‌పై చూడటం అలవాటు లేకపోతే, ఇప్పటికైనా అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ఇటీవల క్యాన్స్ ఫెస్టివల్‌లో అలియా భట్ లుక్స్‌తో ఐశ్వర్యను పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేశారు. అలియా ఫ్యాషన్ చాయిస్‌లను కొందరు ప్రశంసించగా, మరికొందరు ఐశ్వర్యకు మద్దతుగా నిలిచారు. గత రెండు దశాబ్దాలుగా క్యాన్స్ వేదికపై భారతదేశానికి ఐశ్వర్య గర్వకారణంగా ప్రాతినిధ్యం వహిస్తోందని గుర్తుచేశారు.
ఈ ఏడాది ఐశ్వర్యా రాయ్ బచ్చన్ 24వ సారి ప్రతిష్టాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. మొదటి రోజు ఆమె డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన కస్టమ్ బ్లూ గౌనులో మెరిశారు. దానికి డైమండ్ జ్యువెలరీ, డ్రామాటిక్ స్టోల్‌ను జత చేశారు. ఆ తర్వాత పెస్టల్ పింక్ కలర్ దుస్తులలో, చివరగా వైట్ ప్యాంట్ సూట్ మరియు ఫెదర్ రాప్ స్టోల్‌తో స్టైలిష్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.