Love Virus 2: జర్నలిస్ట్ ఎస్.డి. నుమన్ దర్శకత్వంలో, యథార్థ సంఘటన ఆధారంగా రూపొంది సోషల్ మీడియాలో విశేష ప్రజాదరణ పొందిన ‘లవ్ వైరస్’ షార్ట్ ఫిలిం గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి లభించిన అద్భుతమైన స్పందన అందించిన ఉత్సాహంతో, చిత్ర యూనిట్ ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘లవ్ వైరస్–2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది.
Read also-బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..
స్వయంకృషి క్రియేషన్స్ బ్యానర్‌పై అరమాస ప్రవీణ్ నిర్మాతగా, జర్నలిస్ట్ ఎస్.డి. నుమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘లవ్ వైరస్–2’ షార్ట్ ఫిలిం ప్రమోషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక సాంగ్‌ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆదివారం హైదరాబాద్, రాయదుర్గంలోని తన నివాసంలో ఘనంగా ఆవిష్కరించారు.
వినాయక్ అభినందనలు
పాటను విడుదల చేసిన అనంతరం దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లాడుతూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కేవలం 36 గంటల స్వల్ప వ్యవధిలోనే 40 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింను రూపొందించడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ‘లవ్ వైరస్’ మొదటి భాగానికి లభించిన ఆదరణే ఈ రెండో భాగానికి బలమైన ప్రేరణగా నిలిచిందని చెప్పారు. కొత్త ప్రతిభను నమ్మి, వారిని ప్రోత్సహిస్తూ ముందుకొచ్చిన నిర్మాత అరమాస ప్రవీణ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Read also-‘లవ్ అండ్ వార్’ సెట్‌లో ప్రమాదం.. కార్మికుడి మృతి.. పరిహారం డిమాండ్..
ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా..
దర్శకుడు ఎస్.డి. నుమన్ మాట్లాడుతూ, మొదటి భాగం సాధించిన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ప్రేక్షకులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను వమ్ము చేయకుండా ‘లవ్ వైరస్–2’ ను మరింత ఆసక్తికరంగా మలిచామని, ఈ చిత్రం కూడా అందరినీ అలరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు భాను ప్రకాష్, గణపతి, శ్యామ్, డి.ఓ.పీ. హరీష్, శ్రీహర్ష, గ్రాఫిక్ డిజైనర్ ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మొదటి భాగం తరహాలోనే ‘లవ్ వైరస్–2’ కూడా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.