Mythri Movie Makers: టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థగా పేరున్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), ఈ మధ్య ఇతర ఇండస్ట్రీల హీరోలతోనూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ‘జాట్’, కోలీవుడ్‌లో అజిత్ కుమార్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ప్రదీప్ రంగనాథన్‌తో ‘డ్యూడ్’ సినిమాలను నిర్మించిన ఈ సంస్థ, ఇప్పుడు కోలీవుడ్‌లో తమ మూడవ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరని అనుకుంటున్నారా?
Also Read- Manasa Sharma: వెబ్ సిరీస్, సినిమా.. ఈ రెండింటికి తేడా ఏంటంటే.. – ‘రాకాస’ డైరెక్టర్
‘విడుదలై’, ‘కొట్టుకాళి’, ‘గరుడన్’ వంటి వరుస సినిమాలతో దూసుకెళుతోన్న టాలెంటెడ్ నటుడు సూరి (Soori) హీరోగా, వైవిధ్యభరిత దర్శకుడు ఆర్. రవికుమార్ (R Ravikumar) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ని గమనిస్తే.. ఇందులో హీరోని వెనుక నుండి చూపిస్తూ, నడుము లోతు వరకు ఉన్న వరద నీటిలో నిలబడి చేతిలో కత్తిపీట పట్టుకుని కనిపిస్తున్నారు. అతని ప్రతిబింబం నీటిలో చెదిరినట్లుగా కనిపిస్తూ ఒక విభిన్నమైన ఫీల్‌ను ఇస్తోంది. కుడి చేతిలో పట్టుకున్న ఆయుధం ప్రమాదాన్ని సూచిస్తుంటే, చుట్టూ పడి ఉన్న పగిలిన సామాన్లు, చెత్తాచెదారం, బోల్తా పడిన గ్యాస్ సిలిండర్ విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నాయి.
ఈ చిత్రానికి వరద వెంటే రక్తపాతం అనే అర్థం వచ్చేలా ‘Blood Followed the Flood’ అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే హెవీ ఎమోషన్స్‌తో పాటు హింస ప్రధానాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లుగా అర్థమవుతోంది. ‘ఇండ్రు నేట్రు నాళై’, ‘అయలాన్’ వంటి చిత్రాలతో సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆర్. రవికుమార్ ఈసారి ఫుల్ యాక్షన్‌లోకి దిగినట్లుగా ఈ పోస్టర్ తెలియజేస్తుంది. సూరి, రవికుమార్, మైత్రీ.. త్రయంలో ‘సూరి7’ (Soori7)గానూ, ‘మైత్రీతమిళ్03’ (MythriTamil03)గా పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రీ లుక్‌తోనే అంచనాలను పెంచేశారని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నిర్మాతలకు భారీగా లాస్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది.