Nagarjuna Rights: టాలీవుడ్ పరిశ్రమలో నటుల పేరు, రూపం, గొంతు వారి వ్యక్తిగత ఆస్తి వంటివి. వీటిని వారి అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వాడుకోవడం చట్టరీత్యా నేరం. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తన పర్సనాలిటీ రైట్స్ (Personality Rights) ఉల్లంఘనకు గురవుతున్నాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను టీ-షర్టులపై ముద్రించి విక్రయిస్తున్న ఒక వస్త్ర వ్యాపారిపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సదరు వ్యాపారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఒక ప్రముఖ నటుడి ఫోటోలను, పేరును వాడుకుని టీ-షర్టులను విక్రయించే అధికారం మీకు ఎవరిచ్చారు?” అంటూ కోర్టు నిలదీసింది. వాణిజ్యపరమైన లాభాల కోసం ఒక వ్యక్తి గుర్తింపును ఇలా వాడుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వ్యాపారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ కోర్టులో వాదిస్తూ, తాము నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమాకు అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని పేర్కొన్నారు. ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్ హౌస్‌తో తమకు ఒప్పందం ఉందని, స్వయంగా నాగార్జున కూడా గతంలో ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేశారని తెలిపారు. ఈ కారణంతో తమకు ఈ కేసు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
నాగార్జున తరఫు న్యాయవాది ఈ వాదనలను తోసిపుచ్చారు. సదరు వ్యాపారి వద్ద ఎటువంటి సరైన ఒప్పంద పత్రాలు లేవని, కోర్టుకు సమర్పించిన ఈ-మెయిల్ కాపీలు కూడా అసంపూర్ణంగా ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం మధ్యవర్తిత్వ సంస్థలతో మాటలు జరిపినంత మాత్రాన, నటుడి వ్యక్తిగత హక్కులపై అధికారం రాదని వాదించారు.
Read also-Debjani Modak : సత్యభామ ఆస్తులు ఎన్ని కోట్లు..? ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
విచారణ క్రమంలో, నాగార్జునతో గానీ లేదా సంబంధిత నిర్మాణ సంస్థతో గానీ తమకు నేరుగా (Direct Agreement) ఎటువంటి ఒప్పందం లేదని వ్యాపారి అంగీకరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. “ప్రత్యక్ష ఒప్పందం లేనప్పుడు, ఆ టీ-షర్టులను విక్రయించడానికి మీకు చట్టబద్ధమైన హక్కు ఎక్కడి నుంచి వస్తుంది?” అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉందని భావించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.
సెలబ్రిటీల ఫోటోలు, పేర్లను బ్రాండింగ్ కోసం వాడుకునే క్రమంలో ఖచ్చితమైన చట్టపరమైన అనుమతులు ఉండాలని ఈ కేసు మరోసారి స్పష్టం చేస్తోంది. నాగార్జున తీసుకున్న ఈ చొరవ సినీ పరిశ్రమలో పర్సనాలిటీ రైట్స్ ప్రాముఖ్యతపై చర్చకు దారితీసింది.