Lokesh Debut :AP పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న నారా లోకేష్ ఒకప్పుడు హీరోగా లాంచ్ కావాలని ప్రయత్నించాడన్న సంగతి మీకు తెలుసా ..? యస్ ..2000 – 2002 సమయంలో ఇండస్ట్రీకి సరికొత్త టాలెంట్ ని పరిచయం చేస్తూ సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన తేజ డైరెక్షన్ లోనే లోకేష్ హీరోగా లాంచ్ కావాల్సి ఉందట. ఇపుడు దీనికి సంబంధించిన క్లిప్పింగే ఒకటి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.
తేజ దర్శకత్వంలో గ్రాండ్ లాంచింగ్
విషయం లోకి వెళ్తే.. ‘చిత్రం’ (2000), ‘నువ్వు నేను’ (2001) అంటూ కొత్త హీరోలని పెట్టి బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు డైరెక్టర్ తేజ. దీంతో స్టార్స్ లేకున్నా సాలిడ్ సక్సెస్ కొడుతున్న తేజపైనే అందరి కళ్ళు. సరిగ్గా అదే సమయంలో నారా లోకేష్ విదేశాల్లో స్టడీ కంప్లీట్ చేసుకుని రావడంతో లోకేష్ హీరోగా సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయట. ఇక లోకేష్ అప్పట్లో క్యూట్ గా మంచి గ్లామర్ ఉండటంతో తేజ డైరెక్షన్ లో గ్రాండ్ గా లాంచ్ చేయాలని భావించారట.
ALSO READ :ప్రకాష్ రాజ్‌కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్ధమా?
హయ్యర్ స్టడీస్ కోసం కాలిఫోర్నియా
ఇక ఈ సినిమా కోసం మాంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తేజ కథ సిద్దం చేశాడని, పైగా లోకేష్ పై కొన్ని ఫోటో షూట్‌లు కూడా నిర్వహించారని పాత ‘సంతోషం’ మ్యాగజైన్ స్టోరీస్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత లోకేష్ మనసు మార్చుకొని హయ్యర్ స్టడీస్ కోసం కాలిఫోర్నియా వెళ్లిపోవడంతో సినిమా అటకెక్కిందట. అయితే అదే సినిమాకి కొన్ని చేంజెస్ చేసి నితిన్ – సదా జంటగా ‘జయం’ సినిమాని తెరకెక్కించాడట తేజ. ఇక 2002 జూన్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నితిన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి చెప్పక్కర్లేదు.
హీరో కావాల్సిన లోకేష్.. పొలిటీషియన్
నిజానికి ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణలు అప్పటికే ఇండస్ట్రీలో పాగా వేసేశారు. ఇక మూడవ జెనరేషన్లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 2001లో ‘స్టూడెంట్ నంబర్ 1’, 2002లో ‘ఆది’ సినిమాలతో మంచి కమర్షియల్ హీరోగా పాతుకుపోయాడు. బహుశా తారక్ ని చూసి లోకేష్ ని హీరోగా లాంచ్ చేద్దామనుకున్నారేమో కాబోలు. ఏది ఏమైనా లోకేష్ కి అంతగా ఆసక్తి లేకపోవడం, చంద్రబాబు విజన్, మరో వైపు హెరిటేజ్ అప్పుడే డెవలప్ అవుతుండటంతో హీరో కావాల్సిన లోకేష్ కాస్తా పొలిటీషియన్ అయ్యాడు. అయితే లోకేష్ హీరో కాకపోయినా చిన్నాన్న కొడుకు నారా రోహిత్ 2009లో ‘బాణం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
‘జయం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉంటే
ఇక లోకేష్ నట సింహం బాలయ్య కూతురు బ్రాహ్మణిని 2007 ఆగస్ట్ 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక 2014 నుండి పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న లోకేష్, 2017లో ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఏకంగా 90,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యా శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ లో కీ రోల్ పోషిస్తున్నారు.
ఒకవేళ లోకేష్ గనుక ఆనాడు తేజ దర్శకత్వంలో ‘జయం’ వంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉంటే, ఖచ్చితంగా టాలీవుడ్‌లో మరో స్టార్ హీరో తయారయ్యేవారని కొందరంటుంటే, హీరో కాకపోతేనే AP కి ఒక మంచి పొలిటీషియన్ దొరికాడు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి రెండు దశాబ్దాల కిందటి పేపర్ క్లిప్పింగ్ ఇపుడు పాత జ్ఞాపకాలని మళ్ళీ గుర్తుచేస్తుందన్న మాట!