హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా రంజన్ హత్య కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల చిత్రాలను సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు దుండగులు పలుమార్లు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. మృతురాలి ఇంట్లో పనిమనిషిగా చేరిన కల్పన ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో తేలింది. నిందితులు కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ఇంట్లోకి చొరబడి దోపిడీ చేసి తనూజను అంతం చేసి పరారయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు నేపాల్ గ్యాంగ్‌కు చెందిన వారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్య అనంతరం కల్పన మరో ముగ్గురు నిందితులు కలిసి జూబ్లీహిల్స్ నుంచి ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో వారు తప్పించుకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా స్పష్టమైంది. నిందితులు ఢిల్లీ లేదా లక్నో మీదుగా నేపాల్ సరిహద్దు దాటే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
తనూజా రంజన్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసును ఛేదించేందుకు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పనిమనిషిగా చేరిన వ్యక్తుల వివరాలు సేకరించకుండా ఇంట్లో పెట్టుకోవడం వల్లే ఈ అనర్థం జరిగినట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: తమిళ రాజకీయ సినిమాలో స్టాలిన్, విజయ్ హీరోలు..! విలన్ బీజేపీ!