Pawan Kalyan: టికెట్ రేట్లు పెంచడం కన్నా హీరోలు రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటే సరిపోతుంది. కోట్లు కోట్లు పారితోషికాలు తీసుకోవడం.. ఏ ఒక్క హీరో అయినా నిర్మాతకు సాయం చేశారా.. ? బయ్యర్లు నష్టపోతుంటే మేము ఉన్నామని దైర్యం ఇచ్చారా.. ? టికెట్ రేట్లు పెంచమంటే మాత్రం పెంచుతారు.. ఇది ఒక ప్రేక్షకుడు.. హీరోల మీద కానీ, సినిమాల మీద కానీ ఉన్న అభిప్రాయం. మేడి పండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నట్లు.. ఇండస్ట్రీ పైకి అంతా మేలిమి బంగారు రంగులోనే కనిపిస్తుంది. అలా కనిపిస్తుండడంతో ఎవరు ఎన్నైనా అనగలుగుతున్నారు. కానీ, అందులో ఉన్న లొసుగులు ఎవరికి తెలియవు.. అందులో ఉన్న వివాదాలు, గొడవలు.. వారి కష్టం ఇలాంటివేమీ బయటివారికి కనిపించవు.
ఇవన్నీ పక్కన పెడితే.. రెమ్యూనరేషన్ల విషయానికే వస్తే.. డబ్బు కోసమే పవన్ సినిమాలు చేస్తే.. హరిహర వీరమల్లు సినిమాకు పవన్ కు దక్కిందేంటి.. ?. ఆయనకు ఒరిగిందేంటి.. ? మూడేళ్ళ టైమ్.. రూ. 1.5 కోట్లు నష్టం తప్ప. అసలు హీరోలు తమ స్వార్థం చూసుకునేవారు అయితే.. నిర్మాతలకు అండగా నిలబడని వారు అయితే ఇండస్ట్రీలో నిర్మాతలు ఒక సినిమా డిజాస్టర్ అయితే రెండో సినిమా చేసేవారు కాదు. వీరమల్లు విషయానికే వద్దాం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కోసం పవన్ చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. తనను నమ్మిన నిర్మాత రోడ్డున పడకూడదు అని ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోలేదు.
ఏఎం రత్నం.. తన బ్యానర్ లో పవన్ సినిమా చేయాలనీ ఎన్నో ఏళ్ళు ఎదురుచూశాడు. పవన్.. ప్రచారంలో బిజీగా ఉన్నా.. అసలు సినిమా ఆగిపోతుందని తెలిసినా కూడా పవన్ పై ఉన్న నమ్మకంతో హరిహర వీరమల్లు సినిమాను మొదలుపెట్టాడు. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మొదట ఈ సినిమాకు రత్నం.. పవన్ ఇస్తానన్న రెమ్యూనరేషన్ రూ. 50 కోట్లు. ప్రచార సమయంలో రూ. 11 కోట్లు ఇచ్చాడు. ఆ తరువాత నెమ్మదిగా పవన్ సమయం చూసుకొని వీరమల్లు పూర్తిచేశాడు. కానీ, రిలీజ్ కు ముందు ఆర్థిక ఇబ్బందులతో రత్నం చేతులు ఎత్తేశాడు. అయ్యో ఏంటి.. నా సినిమా పరిస్థితి అంటే.. పవన్.. తీసుకున్న రూ. 11 కోట్లను కూడా వెనక్కి ఇచ్చాడు. అంతేనా ఫైనాన్షియర్ల వద్ద నుంచి రత్నంకు డబ్బు ఇసీప్పించాడు. దానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హామీ ఇచ్చింది.
ఇక ఆ అప్పును కూడా పవనే చెల్లించాడు. పిఠాపురంలోని తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఆ అప్పును చెల్లించాడు. ఇదొక్కటే కాదు.. సినిమా రిలీజ్ అయ్యాకా బయ్యర్లు నష్టపోయాం మొర్రో.. మాకు ఒక దారి చూపించండి అంటే వారికి రూ. 1.5 కోట్లు తిరిగి ఇచ్చాడు. ఇలా వీరమల్లు సినిమా కోసం పవన్ చేసింది అంతా ఇంతా కాదు. దీనివల్ల అతనికి ఒరిగింది ఏమి లేదు.. కానీ, ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు. తనను నమ్మినవారికి అండగా నిలబడ్డాడు. అది పవన్ అంటే. అందుకే పవన్ కోసం అభిమానులు ప్రాణాలు అయినా ఇస్తారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.