Ponnam Prabhakar: గాంధీ భవన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన న్యాయనిర్ణేతలని స్పష్టం చేస్తూ, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి తెలిపారు. మేము ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్షంగా మాకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని ఎన్నోసార్లు కోరాం. కానీ ప్రజా ప్రయోజనాలపై చర్చకు రావడం మానేసి విమర్శలకే పరిమితమవుతున్నారు అని వ్యాఖ్యానించారు. అందుకే ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు స్పష్టమైన మద్దతు ఇచ్చారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్‌కు గట్టి గుణపాఠం చెప్పారని విమర్శించారు. ప్రజలే మీ తోలు తీసేశారు. మళ్లీ తోలు రాకుండా పీకేశారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రావాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పీకర్‌ను కోరుతూ ప్రతిపక్ష గౌరవం ఏమాత్రం తగ్గకుండా చూడాలని సూచించారని వెల్లడించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. అయితే ఉనికి కోసమే కేసీఆర్ బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ విమర్శలు చేశారు.
ప్రజా కార్యక్రమాల అమలులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రస్తావించిన మంత్రి, మీరు హాస్టల్ అద్దెలు పెండింగ్‌లో పెట్టారు, మేము వాటిని చెల్లించాం. మీరు గోదాముల్లో స్కూల్స్ పెట్టారు, మేము సొంత భవనాలు నిర్మిస్తున్నాం అని వివరించారు. ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు ఉంటే సభలో చర్చించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు రావడం లేదు? సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తన 12 ఏళ్ల పనితీరుపై లేఖ రాయాలని సవాల్ విసిరారు. ప్రధాని ఇటీవల మందలింపులు చేశారన్న వార్తలు కూడా మీడియాలో వచ్చాయని గుర్తు చేశారు.
Also Read: చావు రాజకీయం.. సీఎం రేవంత్ సవాల్‌ను గులాబీ బాస్ స్వీకరిస్తారా?
కాంగ్రెస్ పార్టీ చరిత్రను గుర్తు చేసిన మంత్రి, నరేంద్ర మోదీ పుట్టక ముందే స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన పార్టీ కాంగ్రెస్. స్వాతంత్య్ర కోసం ప్రాణాలు అర్పించిన పార్టీది అని అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లను కనుమరుగయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దేశానికి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు.