Peddi Collections: గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బకి డీలా పడ్డ చరణ్ భారీ అంచనాలు పెట్టుకొని చేసిన సినిమా పెద్ది. మిగతా హీరోల ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తే మా వంతు ఎప్పుడొస్తుందా అని చరణ్ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఎదురుచూసిన సినిమా ఇది.ఇక ఎట్టకేలకి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ జూన్ 4న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా వచ్చీ రాగానే కలెక్షన్ల సునామీ స్ప్రుష్టించడంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్ .యస్ .. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 181.8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని అందుకుంది.
ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను వదిలింది.మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 135.36 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన పెద్ది, రెండో రోజు కాస్త జోరు తగ్గించినా రామ్‌చరణ్ స్టార్ స్టామినాకు తగ్గకుండా వసూళ్లను రాబట్టడం విశేషం.
రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా చరణ్ చూపించిన విశ్వరూపాన్ని ఈ చిత్రంలో ‘పెద్ది’ పాత్రతో మరో స్థాయికి తీసుకెళ్లారని పండగ చేసుకుంటున్నారు మూవీ లవర్స్.ఈ చిత్రానికి వస్తున్న సాలిడ్ రెస్పాన్స్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ రియాక్ట్ అవుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.‘పెద్ది’ ఒక బలమైన కథా నేపథ్యంతో, అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన విభిన్నమైన యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని, ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్‌ను, నటీనటుల ప్రతిభను ఎంతగానో ఆదరిస్తున్నారని మేకర్స్ స్పష్టం చేశారు.
మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని సీన్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా స్పందించారు. సినిమాల్లో గానీ, బయట గానీ మహిళల్ని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్తూ, ప్రేక్షకుల మరియు విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆ సీన్లను మార్పు చేయడం లేదా పూర్తిగా తొలగించడం చేస్తామని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్షమాపణలు కోరారు.
పక్కా గ్రామీణ క్రీడా నేపథ్యంతో సాగే ‘పెద్ది’ సినిమా తన గ్రామానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని తపించే ఒక సాధారణ పల్లెటూరి యువకుడిగా ఒదిగిపోయాడు చరణ్. 1980ల కాలం నాటి పీరియాడిక్ పరిస్థితుల ఆధారంగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండ దిగువన ఉన్న ఒక మారుమూల గ్రామం చుట్టూ స్టోరీని అల్లుకున్నాడు బుచ్చిబాబు.వందలాది కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ బాహ్య ప్రపంచానికి ఏమాత్రం తెలియని ఆ ఊరిలో కూలీగా పనిచేసే ‘పెద్ది’ అనే యువకుడు సమాజంలో ఎదురయ్యే అణచివేతను, ఆర్థిక-సామాజిక వివక్షలను ఎలా ఎదిరించాడనేది ఇందులో అద్భుతంగా చూపించారు.
గతంలో వచ్చిన సై లాంటి స్పోర్ట్స్ డ్రామాలు లేదా భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం పూర్తి భిన్నమైన అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు . తన గ్రామానికి ఒక గుర్తింపును సాధించి పెట్టే క్రమంలో భాగంగా.. క్రికెట్, కుస్తీ, అథ్లెటిక్స్ వంటి మూడు విభిన్న క్రీడలను మూడు వేర్వేరు దశల్లో వాడుకుని హీరో సాగించిన ప్రయాణం థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమాలో పండించిన ఎమోషనల్ సీన్స్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రామ్ చరణ్ నటన సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. భారీ ఓపెనింగ్స్‌తో రేసు మొదలుపెట్టిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని అద్భుతమైన రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ మూవీ మరెన్ని వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.
also read :రూ. 4000 కోట్లా? అంత సీన్ లేదు..‘రామాయణ’, ‘వారణాసి’లపై మనోజ్ భాజ్‌పేయి సెన్సేషన్ కామెంట్స్