Star Actor: ఒకానొక సమయంలో పెళ్లి అంటే కష్టమైనా..నష్టమైనా.. ఒక్కసారి బంధం ముడిపడింది అంటే జీవితాంతం కొనసాగే వారు. కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రత్యేకించి కొన్ని జంటలు అలా పెళ్లి చేసుకుని ఇలా విడిపోతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అంతేకాదు పెళ్లి అంటే బొమ్మల పెళ్లి అని కొట్టి పారేస్తున్నారు. అసలు పెళ్లిని ఎగతాళి చేస్తూ.. ప్రవర్తిస్తున్న తీరు కొంతమందికి ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక సామాన్యుల విషయం కాస్త పక్కన పెడితే ప్రత్యేకించి సెలబ్రిటీల గురించి చెప్పుకోవాలి. కొన్ని జంటలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిస్తే.. మరికొన్ని జంటలు వివాహమైన సంవత్సరంలోపే విడిపోతున్నారు. ఇంకొన్ని జంటలు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పెళ్లీడుకొచ్చిన సమయంలో కూడా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక నటుడు కం విలన్ బాలీవుడ్ లో 90% పెళ్లిళ్లు ఫేక్ అని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.
ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్ (Raj Babbar )తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతీక్ స్మిత పాటిల్ (Prateik Smita Patil). తెలుగులో నాచురల్ స్టార్ నాని (Nani)హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇకపోతే కుటుంబంలో నెలకొన్న ఇబ్బందుల కారణంగానే ఆయన గత కొంతకాలంగా తన తండ్రికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..పైగా గత ఏడాది ప్రియా బెనర్జీతో ఏడడుగులు వేసిన సమయంలో కూడా తన తండ్రిని వివాహానికి ఆహ్వానించలేదు. ఆ సమయంలో ప్రతీక్ తన తండ్రిని తన వివాహానికి పిలవకపోవడంతో చాలామంది ప్రతీక్ పై విమర్శలు గుప్పించారు . ఎలాంటి వాడైనా సరే తండ్రిని వివాహానికి పిలవడం తప్పనిసరి అంటూ కామెంట్లు చేశారు. ఇకపోతే తాజాగా తన భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ లో బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతీక్ మాట్లాడుతూ .. పైకి కనిపించే రంగుల గురించి ప్రజలకు చాలా వరకు వాస్తవాలు తెలియదు. ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే అవి తెలుస్తాయి. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా అందరికీ నిజం తెలిసి తీరుతుంది. అది ఒక కథ, పుస్తకం, ఇంటర్వ్యూ లేదా సినిమాగా కూడా రావొచ్చు. మా పెళ్ళికి ముందు జీవితం మాకు ఎన్నో పరీక్షలు పెట్టింది. ఎవరి స్థాయికి తగినట్లు వారికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే అలా వచ్చిన ప్రతి సమస్యకి కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మాకు వచ్చిన కష్టాలకు మేము ఒకరికొకరు తోడుగా నిలిచాము.
ALSO READ:Gopichandh -Balakrishna: బడ్జెట్ లోపం.. ఏకంగా కథనే మార్చేసిన గోపీచంద్.. ఏంటి గురూ ఇది!
ముఖ్యంగా బాలీవుడ్లో 90 శాతం వివాహ బంధాలు ముసుగుతోనే ఉంటాయి. ఎందుకంటే మేము ఇండస్ట్రీలోనే ఉన్నాం కాబట్టి పెళ్లయిన వాళ్ళు “రాత్రి అయిపోతే.. విషయం అయిపోయినట్టే” అంటున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒకరినొకరు మోసగించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఒక్కరితో ఆగడం లేదు. మన సంస్కృతి చాలా గొప్పది. కానీ ఇక్కడ(Bollywood )పెళ్లిని ఒక జోక్ లా చూస్తున్నారు”అంటూ ప్రతీక్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం వీరు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.