Pavala Shyamala: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వందలాది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి పావలా శ్యామల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక నడిరోడ్డుపై నిస్సహాయ స్థితిలో పడి ఉండటం అందరినీ కలచివేస్తోంది.
గత కొంతకాలంగా తీవ్ర గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే, ఆమె వద్ద వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించింది. ఆమెకు అత్యవసర చికిత్స అందించాల్సింది పోయి, బెడ్ ఖాళీ లేదనో లేదా ఇతర కారణాలు చెప్పి.. ఒక ప్రైవేట్ క్యాబ్ ఎక్కించి ఆసుపత్రి నుంచి పంపించివేసింది.
ఆసుపత్రి యాజమాన్యమే అలా ప్రవర్తిస్తే, క్యాబ్ డ్రైవర్ మరింత దారుణానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, కూకట్‌పల్లిలోని ఒక ప్రధాన జంక్షన్ వద్దకు రాగానే ఆమెను రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యం, దానికి తోడు తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమె అర్ధరాత్రి వేళ ఏం చేయాలో తెలియక గందరగోళ స్థితిలో రోడ్డుపైనే ఉండిపోయారు.
అర్ధరాత్రి వేళ ఫుట్‌పాత్‌పై దీన స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని గమనించిన స్థానికులు, ఆమె సినీ నటి పావలా శ్యామల అని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆమెకు ప్రాథమికంగా ఊరట కల్పించి, వెంటనే సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ సంరక్షణలో ఉన్నారు.
వెండితెరపై ఎన్నో పాత్రలతో నవ్వించిన ఒక సీనియర్ నటి.. వృద్ధాప్యంలో, అనారోగ్య సమయంలో పైసా లేక ఇలా నడిరోడ్డుపైకి రావడం టాలీవుడ్‌లోనే ఒక నల్లటి మచ్చగా మిగిలిపోనుంది. గతంలో కొందరు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేసినప్పటికీ, ఆమె శాశ్వత ఆరోగ్య అవసరాలకు అది సరిపోవడం లేదు. ఇప్పటికైనా ‘మా’ (MAA) అసోసియేషన్ మరియు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆమెకు మెరుగైన ఉచిత వైద్య సాయం అందించాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కోరుతున్నారు.