Suriya 47: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు సూర్య(Suriya) ఒకరు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు ఇక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తుంటారు. ఇక ఇటీవల కెరియర్ పరంగా సూర్య ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సూర్య మరో కొత్త సినిమా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకున్నారు. నేడు చెన్నైలో ఈ సినిమా పూజ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సూర్య తన 47వ సినిమాని ఆవేశం సినిమాతో సంచలనాలను సృష్టించిన మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్(JithuMadhavan) దర్శకత్వంలో చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్యకు జోడిగా మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా (Nazriya)నటిస్తున్నారు. మరో హీరో నస్లెన్ కూడా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సుసిన్ శ్యామ్ సంగీతం అందించబోతున్నారు. ఆవేశం లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తరువాత జిత్తు దర్శకత్వంలో సూర్య చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో సూర్య పాత్ర ఏంటి తనని ఎలా చూపించబోతున్నారనే విషయాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
ఇక ఈ సినిమాలో సూర్యకు జోడిగా నజ్రియా నటించబోతున్నారు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే ఓ సినిమా రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. సుధా కొంగరదర్శకత్వంలో సూర్య నటించిన సినిమాలో ముందుగా హీరోయిన్ గా నజ్రియాని ఎంపిక చేశారు కానీ కొన్ని కారణాలవల్ల ఈ జోడి కుదరలేదు. ఇలా అప్పుడు మిస్ అయిన ఈ జోడి త్వరలో మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెట్రోతో మెప్పించలేకపోయిన సూర్య..
ఇప్పటికే సూర్య నటించిన కరుప్పు సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఈయన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఇప్పుడు జిత్తు మాధవన్ డైరెక్షన్ లో కూడా బిజీ కానున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టి సూర్య కెరియర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల సూర్య రెట్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.