Telugu Film Chamber Elections:తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఎన్నికల రాజకీయం ఇపుడు మరింత రసకందాయంలో పడింది.ఇక ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో ప్యానెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే “మన ప్యానెల్” నాయకులు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థి ప్యానెల్ తీరుపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ లు మాట్లాడుతూ నిర్మాతల మండలి ఉనికిని, చిన్న సినిమాల భవిష్యత్తును కాపాడుకోవడానికే తాము బరిలోకి దిగామని స్పష్టం చేశారు.
ఇక ఈ ప్రెస్ మీట్‌లో సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ, తమతో పోటీపడుతున్న ప్యానెల్ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారని, కానీ తమ ప్యానెల్ చేసేవే చెబుతుందని స్పష్టం చేశారు. కౌన్సిల్‌కు రావలసిన నిధులను గిల్డ్‌కు మళ్లించి, అక్కడ కొందరు ఆ సొమ్మును అనుభవిస్తున్నారంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు.
గత రెండేళ్లలో కౌన్సిల్ బాగుపడటం కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదని, అసలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని తెలిపారు.ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఏడాదికి దాదాపు 300 చిన్న సినిమాలు నిర్మించబడుతున్నాయని,వాటి ద్వారా దాదాపుగా 40 వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని గుర్తుచేశారు.
చిన్న నిర్మాతలకు అండగా ఉండటమే తమ ప్రధాన ధ్యేయమని, ఒక్క సినిమా తీసిన నిర్మాతకు కూడా మెడిక్లైమ్ వర్తించేలా తాము చర్యలు తీసుకున్నామని చెప్పారు. గిల్డ్ వర్గం తమపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ, కౌన్సిల్ నిధుల దుర్వినియోగాన్ని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
ఇక మరో సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, 1990లలో మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో సహకరించారని తెలిపారు.ఇదే క్రమంలో కౌన్సిల్ డబ్బులని గిల్డ్ లోకి మళ్లించిన తీరుపై మండిపడ్డారు. తమ ప్యానెల్‌ను పూర్తి మెజారిటీతో గెలిపిస్తే కౌన్సిల్ వ్యవహారాలన్నింటినీ పారదర్శకంగా మారుస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలోని ప్రతీ చిన్న, పెద్ద నిర్మాత బాగుండాలనేదే తమ కోరిక అని చెప్పుకొచ్చారు.
ఇక తుమ్మల ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ, గతంలో తమను కొందరు మోసం చేశారని ,కాని మా కౌన్సిల్ మాత్రం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల సమస్యల పరిష్కారంలోనూ కౌన్సిల్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.
డివివి దానయ్య, సునీల్ నారంగ్, వంశీ నందిపాటి వంటి ప్రముఖ నిర్మాతలు కౌన్సిల్‌తో కలసి నిలబడి మంచి చిత్రాలను నిర్మిస్తున్నారని కొనియాడారు. తమకి పోటీగా నిలబడే వర్గం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని, తాము మాత్రం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ చిన్న నిర్మాతల అభివృద్దికి సహకరిస్తామని వివరించారు.
చూడాలి మరి డీ అంటే డీ అంటున్న ఈ రెండు ఫ్యానల్ లలో ఎవరు విజయాన్ని సొంతం చేసుకుంటారో !
ALSO READ:మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్