Ustaad Bhagath Singh vs Dhurandhar 2:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఉస్తాద్ భగత్ సింగ్.. ధురంధర్ 2 సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ. ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా టికెట్ ధరలు, అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ప్రమోషన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా..నిర్ణయించారు.
అలాగే సినిమా విడుదలైన తర్వాత మొదటి పది రోజుల పాటు మల్టీప్లెక్స్ థియేటర్లలో సాధారణ ధరకు అదనంగా రూ.125 వసూలు చేయవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం రూ.100 అదనంగా తీసుకునేందుకు అనుమతి ఉంది. ఇటీవల కొన్ని పెద్ద సినిమాలకు బెనిఫిట్ షో టికెట్లు రూ.800 నుండి రూ.1000 వరకు ఉండటంతో పోలిస్తే ఈ ధరలు కొంత తక్కువగానే ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఇదే తరహా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆ ఆదేశాలు వచ్చిన వెంటనే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఇక రిలీజ్ టైమింగ్ కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉంది. మార్చి 19న ఉగాది పండుగ ఉండగా, వెంటనే మరుసటి రోజు ఈద్ పండుగ కూడా ఉంది. వరుసగా రెండు పండుగలు రావడం వల్ల మొదటి వీకెండ్‌లో థియేటర్లకు భారీగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ధురంధర్ 2 సినిమా మాత్రం టికెట్ ధరల పెంపు లేకుండా విడుదల అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమాకు ఇప్పటికే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిజాం ప్రాంతంలో టికెట్ బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉస్తాద్ టికెట్ హైక్ లేకుండా వచ్చుంటే ధురంధర్ సినిమా బుకింగ్ తగ్గి ఉండొచ్చని.. కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ హైక్ వల్ల ధురంధర్ సినిమాకి బుకింగ్స్ మరింత పెరగొచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌కు ఉన్న భారీ అభిమాన వర్గం కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభ రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే టికెట్ ధరలు పెరగడం మాత్రమే సినిమా విజయాన్ని నిర్ణయించదు. సినిమా కంటెంట్ బాగుంటేనే దీర్ఘకాలం థియేటర్లలో నిలబడుతుంది.
ఇక ధురంధర్ మొదటి భాగం మంచి కథ, సంగీతం.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే రెండో భాగంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మంచి టాక్ వస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లు ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేదని కొందరు అంటున్నారు. టీజర్.. పాటలు పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ట్రైలర్ మాత్రం పరవాలేదు అనిపించింది. ఈ క్రమంలో ఈ టికెట్ హైక్ కూడా కొంచెం నెగిటివ్ కావచ్చు. అయితే మార్చి 15న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
సినిమా విడుదల తర్వాత మంచి రివ్యూలు వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పటికే భారీ హైప్ ఉన్న ధురంధర్ 2 పోటీ మరింత కఠినంగా మారవచ్చు.