Jana Nayagan:సినిమా రంగంలో రారాజుగా వెలుగు వెలిగి, ఇప్పుడు ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టిన ‘దళపతి’ విజయ్ చుట్టూ రాజకీయ సెగలు ముసురుకుంటున్నాయి. ఆయన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదలలో ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన రాజకీయ నిర్ణయం వల్లే నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని విజయ్ ఆవేదన వ్యక్తం చేసినా, ఇలాంటి సవాళ్లు ఎదురవుతాయని తాను ముందే ఊహించానని చెప్పడం ఆయనలోని పరిణతిని చాటుతోంది. అడ్డంకులు ఎన్ని వచ్చినా ప్రజా సేవలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు తన సినిమాలపై ఒత్తిడి ఉంటుందని విజయ్ చాలా క్లారిటీగా ఉన్నారు. తన రాజకీయ ప్రవేశం వల్ల ‘జన నాయగన్’ సినిమా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడటంపై ఆయన స్పందిస్తూ.. “రాజకీయ ప్రయాణం పూల బాట కాదు, ముళ్ల బాట అని నాకు తెలుసు. నిర్మాతలు నష్టపోవడం బాధాకరమే కానీ, ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవ్వడం సహజం” అని పేర్కొన్నారు. ప్రత్యర్థులు తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సినిమాలను అడ్డుపెట్టుకుంటున్నారనే విషయాన్ని ఆయన పరోక్షంగా బయటపెట్టారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు నటిస్తున్న చివరి (69వ) చిత్రం కావడంతో ‘జన నాయగన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘వాలిమై’, ‘తునివు’ చిత్రాల ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది బీస్ట్’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.
అలాగే మలయాళ సెన్సేషన్ మమితా బైజు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి రూపొందించిన ‘భగవంత్ కేసరి’ కథకు ఇది అనుకరణ అని సమాచారం. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
విజయ్ మాటల్లో ఓటమి భయం కంటే, పోరాట పటిమ ఎక్కువగా కనిపిస్తోంది. ‘జన నాయగన్’ అంటేనే ‘ప్రజా నాయకుడు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఆయన తన వ్యక్తిగత కెరీర్ కంటే రాజకీయ బాధ్యతకే పెద్దపీట వేస్తున్నారు. ఈ సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక చిక్కులు త్వరలోనే తొలగిపోతాయని, తనను నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ:Anil Ravipudi: అనిల్ రావిపూడి ఫ్యామిలీని చూశారా.. ఏంటీ అనిల్ కి ఇంత పెద్ద కూతురుందా?