Chiyaan Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తన అద్భుతమైన నటనతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఐ.. పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాల్లో ఆయన చేసిన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆయన కెరీర్‌లో చాలా కఠినమైన పాత్రలలో.. ఒకటి అపరిచితుడు సినిమా అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకరకంగా విక్రమ్ కి అంతటి పేరు రావడానికి కారణం అపరిచితుడు సినిమా అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం గురించి ఈ హీరో గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాహ్‌బాదియా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సినిమాలో ఆయన ఒకేసారి మూడు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలు చేశారు. ఆ సమయంలో అలా పాత్రల మధ్య మారడం తనకు చాలా కష్టం అయిందని చెప్పారు.
విక్రమ్ మాట్లాడుతూ “అపరిచితుడు సినిమా నన్ను కొంచెం డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే అందులో మూడు పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు అయితే నేను సులభంగా పాత్రలు మార్చగలను. కానీ అప్పట్లో అంత సులువు కాదు. ముందుగా రామానుజం పాత్ర చేస్తే తరువాత రీమో పాత్ర చేసేవాళ్లం. తరువాత అపరిచితుడు పాత్ర చేసేవాళ్లం” అని తెలిపారు.
ఈ సినిమాలో విక్రమ్ మూడు భిన్నమైన పాత్రలు పోషించారు. రామానుజం అనే పాత్ర ఒక ప్రశాంతమైన న్యాయవాది. రీమో అనే పాత్ర ఒక స్టైలిష్ మోడల్. అపరిచితుడు అనే పాత్ర సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కొనే వ్యక్తి. ఈ మూడు పాత్రలకు వేర్వేరు శరీర భాష మరియు భావాలు ఉండేవి. అందుకే ప్రతి సారి నటనలో పూర్తిగా మారాల్సి వచ్చేదని ఆయన చెప్పారు.
షూటింగ్ సమయంలో పాత్ర నుంచి బయటకు రావడం కూడా చాలా కష్టమయ్యేదని విక్రమ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “మేము 15 రోజులు షూటింగ్ చేసేవాళ్లం. తరువాత మరో 15 రోజులు రెడీ అయ్యేవాళ్లం. ఇలా 15 రోజులు పని. 15 రోజులు బ్రేక్ ఉండేది. మీరు నమ్మరు కానీ నేను ఇంటి టెర్రస్ మీదికి వెళ్లి కూర్చునేవాడిని” అని చెప్పారు.
ఆ సమయంలో తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒంటరిగా సమయం గడిపేవాడని తెలిపారు. విక్రమ్ మాట్లాడుతూ.. “అక్కడ నేను పావురాలను పెంచేవాడిని. వాటిని ఎగరనిచ్చి రోజంతా చూస్తూ ఉండేవాడిని. అక్కడే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేవాడిని. ఒక మంచం ఉండేది. దానిపై పడుకుని విశ్రాంతి తీసుకునేవాడిని. సాయంత్రం వరకు అక్కడే ఉండేవాడిని. ఎవ్వరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే పాత్ర నుంచి బయటకు రావడం కష్టం అయ్యేది” అని వివరించారు.
అపరిచితుడు సినిమా 2005లో విడుదలైంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహించారు. సైకాలజికల్ యాక్షన్ కథతో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సదా, వివేక్, నాసర్, నెడుముడి వేణు.. ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ALSO READ: Meenakshi Chowdary: కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన మీనమ్మ… కోరికలు మామూలుగా లేవే?