తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ తమ ఎన్నికకు సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి ఈ సర్టిఫికేట్లను స్వీకరించిన అనంతరం నూతన సభ్యులకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపాయి. తెలంగాణలో ఖాళీ అయిన స్థానాలకు వీరిద్దరినీ కాంగ్రెస్ అధిష్ఠానం బరిలోకి దింపగా.. ఇతర పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. పార్లమెంటు ఎగువ సభలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
సర్టిఫికేట్లు అందుకున్న అనంతరం వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక కార్యకర్తగా శక్తివంచన లేకుండా కృషి చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేలా తన వంతు సహకారం అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటానని.. ఎవరిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని.. భవిష్యత్తులో కూడా అదే పంథా కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
తన పదవిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు చేసేవారు సవాలక్ష అంటుంటారని.. వాటన్నింటికీ స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చిచెప్పారు. తనతో అనవసరంగా మాట్లాడించాలనే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని కోరారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కే సముద్రం నియోజకవర్గ సమీకరణాల్లో చాలు మార్పులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి ఆయన స్పందించారు. అంతర్జాలంలో తమ గురించి ఏం వస్తుందో తనకు తెలియదని.. అయితే తామిద్దరం అత్యంత సన్నిహిత మిత్రులమని పేర్కొన్నారు. తమ మధ్య ఉన్న స్నేహం చాలా బలమైనదని.. దానిని ఎవరూ విడదీయలేరని వేం నరేందర్ రెడ్డి భావోద్వేగంగా వెల్లడించారు. ఒక సామాన్య కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగేందుకు సహకరించిన నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ: Kalvakunta Kavitha: ఖమ్మంలో ఉద్రిక్తత.. కల్వకుంట్ల కవిత అరెస్ట్..