CJP Abhijeet Dipke: షాకింగ్ కామెంట్స్ చేశారు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే. తాను భయపడేది లేదని, ఇక్కడే ఉన్నానన్నారు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులకు సవాల్ చేశారు. ఆంక్షలకు బెదిరేదిలేదని స్పష్టం చేశారు. నా ఇంటి చుట్టూ పోలీసులు, ఐబీ సిబ్బంది నిఘా పెట్టారని ఆరోపించారు. ఇంతకీ దీప్కే ఆరపణల వెనుక అసలు ఏం జరుగుతోంది?
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది బొద్దింకల పార్టీ సీజేపీ. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో సీజేపీ నిర్వహించనున్న లెహ్రా దో తిరంగా మార్చ్‌కు తలపెట్టింది. ఈ క్రమంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇంటి చుట్టూ రహస్య గూఢచారులు ఉన్నారని, తన ఇంటికి ఎవరు వస్తున్నారు అనేదానిపై నిఘా పెట్టారని ఆరోపించారు. తనను పోలీసులు ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.
సీజేపీ మార్చ్‌కు ముందు భద్రతా ఆంక్షలు విధించి సెంట్రల్ పార్క్ మూసివేశారని ఆరోపించారు. తన ఇంటికి వచ్చినవారి వాహనాలను నిఘా వర్గాలు వెంబడిస్తున్నాయని, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది తన ఇంటి బయట వాచ్‌మన్ నుండి సమాచారం తీసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు ఈ రాత్రి లేకుంటే శుక్రవారం నన్ను అదుపులోకి తీసుకోవచ్చన్నారు. మేము దీనికి భయపడబోమని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈసీల మాట వినని జ్ఞానేష్ కుమార్‌ను తొలగించి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించాలని కోరుతున్నామని, ఇది నేరమా? అంటూ ప్రశ్నించారు. గురువారం అర్ధరాత్రి ఆలస్యంగా మీడియాతో ఆయన మాట్లాడారు. అవసరమైతే జాతీయ జెండాను ఎగురవేసినందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధమేనన్నారు. శుక్రవారం శాంతియుతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తామన్నారు. ఈ దేశ పౌరులుగా మీరు దీన్ని నేరంగా పరిగణిస్తే మీరే అతిపెద్ద ద్రోహులు అవుతారని అన్నారు.
ALSO READ: ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?
దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తే అందుకు తాము సిద్ధమేనన్నారు. 100 చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి సీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మరి ఆ ప్రదేశాలను ప్రభుత్వం మూసివేస్తుందా? అని ప్రశ్నించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు పౌరులను జైలులో పెడుతున్నారని ఆరోపించారు. సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానికి త్రివర్ణ పతాకం అంటే ఎందుకంత ద్వేషం? ద్వేషం ఉంటే ప్రధానిగా ఉండేందుకు అర్హుడా? అంటూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు దీప్కే.