White Towel Removal: తమిళనాడు రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, సీఎం విజయ్ సోషల్ మీడియాను ఎంత నిశితంగా గమనిస్తున్నారనే దానికి తాజా ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక క్లైమేట్ యాక్టివిస్ట్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీపై ఉండే ‘తెల్లటి టవల్’ను తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కొద్దిరోజుల క్రితం ప్రముఖ భారత క్లైమేట్ యాక్టివిస్ట్ 11 ఏళ్ల లిసిప్రియ కంగుజం (Licypriya Kangujam) ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. రాజకీయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా కొనసాగుతున్న ‘వీఐపీ సంస్కృతి’ (VIP Culture)కి ముగింపు పలకాలని కోరారు. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి కూర్చునే అధికారిక కుర్చీపై ప్రత్యేకంగా పరిచే ‘తెల్లటి టవల్’ (White Towel) విఐపీ సంస్కృతికి ప్రతీకగా ఉందని బాలిక పేర్కొన్నారు. కొత్తగా సీఎం అయిన విజయ్.. ఈ వీఐపీ సంప్రదాయానికి ముగింపు పలకాలని దాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
లిసిప్రియ కంగుజం చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో విజయ్ కార్యాలయం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సదరు యాక్టివిస్ట్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని.. ముఖ్యమంత్రి కుర్చీపై ఉండే ఆ తెల్లటి టవల్‌ను తమిళనాడు సీఎంఓ అధికారులు తొలగించారు. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే విజ్ఞప్తులు, ఇలాంటి చిన్న చిన్న విషయాలను ప్రభుత్వాలు, సీఎం కార్యాలాయాలు పెద్దగా పట్టించుకోవు. కానీ నెట్టింట వచ్చిన విమర్శను సానుకూలంగా తీసుకుని.. అంత వేగంగా మార్పు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే ఈ మెుత్తం వ్యవహారంలో ఒక విషయం బాగా అర్థమవుతోంది. సీఎం విజయ్ నెట్టింట చోటుచేసుకుంటున్న పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే సోషల్ మీడియా విభాగం.. సోషల్ మీడియా ట్రెండ్స్, ప్రజల అభిప్రాయాను నిరంతరం ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా చేసిన పోస్ట్.. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో విజయ్.. వారి సూచనలను గౌరవిస్తూ వైట్ టవల్ ను తొలగించారని తెలుస్తోంది. కాబట్టి విజయ్ తన రాజకీయ వ్యూహాల్లో భాగంగా సోషల్ మీడియా పోస్టులు, నెటిజన్ల అభిప్రాయాలకు ఏస్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read: BSNL నమ్మశక్యం కాని ఆఫర్.. 330 రోజుల పాటు.. అపరిమిత కాల్స్, డేటా!
సీఎం కూర్చీలో చోటుచేసుకున్న చిన్న మార్పు.. తమిళ రాజకీయాలతోపాటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కేవలం ఒక ఎక్స్ పోస్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక సంప్రదాయాన్ని మార్చడం అనేది సామాన్యుల వాయిస్‌కు దక్కిన గౌరవంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలోని చిన్న మార్పులను కూడా గమనిస్తూ అప్రమత్తంగా ఉంటున్న విజయ్ లాంటి యువ నాయకులు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులు తీసుకువస్తారో చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Jio సూపర్ ప్లాన్.. ఫ్రీ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ.. ఇంత తక్కువ ధరకా..!