Investigative Thriller: ఓటీటీలో ప్రతి వారం ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మొదటి పది నిమిషాల నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాక్కెళ్లి, చివరి సీన్ వరకు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉత్కంఠను కొనసాగిస్తాయి. ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్, సీరియల్ కిల్లర్ మిస్టరీ, ఎమోషనల్ డ్రామా… ఈ మూడు అంశాలు ఒకే కథలో కలిస్తే ఆ సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. అలాంటి ఓ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లరే ‘కేస్ ఆఫ్ కొండాన’ (Case of Kondana). కన్నడలో మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఇందులో ఉన్న సస్పెన్స్ ఏంటి ? ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
బెంగళూరు శివార్లలో ఉన్న కొండాన అనే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు కొత్తగా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విల్సన్ బాధ్యతలు చేపడతాడు. నేరస్థుల విషయంలో ఏమాత్రం రాజీ పడని పోలీస్ ఆఫీసర్‌గా అతనికి పేరు ఉంటుంది. విధుల్లో చేరిన కొద్ది సేపటికే ఓ స్థానిక గ్యాంగ్‌స్టర్‌తో గొడవ పడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి అతని జీవితంలో ఊహించని సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి.
మరోవైపు అదే ప్రాంతంలో ఏసీపీ లక్ష్మి ఒక ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ కోసం గాలింపు చేపడుతుంది. ఆ కిల్లర్ ఎవరనే విషయం ఎవరికీ తెలియదు. అతను వదిలే ఆధారాలు, జరిగే హత్యలు పోలీసులకు పెద్ద సవాలుగా మారతాయి. అదే సమయంలో విలువైన వస్తువులు దొంగిలిస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మరో దొంగ కోసం కూడా ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకోవైపు రాజు అనే పానీపూరి వ్యాపారి అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును కాపాడుకోవడానికి డబ్బు కోసం తీవ్రంగా పోరాడుతుంటాడు. కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆరాటంలో అతను తీసుకునే ఒక నిర్ణయం అనుకోకుండా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
ఒక పోలీస్ ఆఫీసర్… ఒక ఏసీపీ దర్యాప్తు… ఒక సామాన్య కుటుంబం. మొదట్లో ఈ మూడు కథలు వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ రాత్రి గడుస్తున్న కొద్దీ ఈ మూడు జీవితాలు ఒకే నేరం చుట్టూ తిరుగుతున్నాయనే విషయం ఒక్కో ట్విస్ట్‌తో బయటపడుతుంది. ప్రతి పదినిమిషాలకు కథ కొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకుడి అంచనాలను పూర్తిగా మార్చేస్తుంది. అసలు కొండానలో జరిగిన ఆ క్రైమ్ ఏమిటి ? విల్సన్ ఎదుర్కొన్న అసలు పరీక్ష ఏంటి ? ఏసీపీ లక్ష్మి వెతుకుతున్న సీరియల్ కిల్లర్ ఎవరు ? రాజుకి ఈ కేసుతో సంబంధం ఏంటి ? చివరికి ఈ మూడు కథలు ఎలా ఒకే ముగింపుకు చేరుకున్నాయి ? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే… దాదాపు మొత్తం కథ ఒకే రాత్రిలో జరుగుతుంది. దర్శకుడు అనవసరమైన కమర్షియల్ సీన్లు, పాటలు, ఫైట్లు పెట్టకుండా పూర్తిగా కథపైనే దృష్టి పెట్టాడు. అందుకే ప్రతి సీన్‌కు ఓ ప్రయోజనం ఉంటుంది. ఒక్క క్లూ కూడా వృథా కాదు. చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడు ముందే ఊహించడం కూడా కాస్త కష్టమే. ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేశారు. పాత్రల ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సన్నివేశాన్ని మరింత ఇంటెన్స్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.
‘కేస్ ఆఫ్ కొండాన’ చిత్రంలో విజయ్ రాఘవేంద్ర, భావన మీనన్, ఖుషీ రవి, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించగా, గగన్ బదేరియా సంగీతం అందించారు. ఈ కన్నడ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం ETV Win ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ సినిమాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, డార్క్ క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి ఛాయిస్. కథ నెమ్మదిగా మొదలైనప్పటికీ, ఒక్కసారి అసలు కేసు ట్రాక్‌లోకి వచ్చాక చివరి వరకు స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే.
Read Also: సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్