Korean Political Action Drama: ఓ సాధారణ టాక్సీ డ్రైవర్… కేవలం డబ్బు కోసం ఓ విదేశీ ప్రయాణికుడిని గ్వాంగ్జు నగరానికి తీసుకెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లాక అతని కళ్లముందు కనిపించిన దృశ్యాలు అతని జీవితాన్నే మార్చేస్తాయి. సైన్యం కాల్పులు… రక్తపాతం… ప్రజల ఆర్తనాదాలు… ఇవన్నీ ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం దాచిపెట్టాలని చూస్తుంటే, ఓ టాక్సీ డ్రైవర్ మాత్రం ఓ జర్నలిస్ట్ ను ప్రాణాలకు తెగించి కాపాడాల్సి వస్తుంది. అసలు ఆ జర్నలిస్ట్ ఎవరు ? అతను గ్వాంగ్జుకు ఎందుకు వచ్చాడు ? ఆ టాక్సీ డ్రైవర్ చివరికి ఏం చేశాడు ? అదే ‘ఎ టాక్సీ డ్రైవర్’ (A Taxi Driver 2017) కథ. మరి ఈ కొరియన్ డ్రామాను తెలుగులో చూడొచ్చా ? అనే వివరాలను తెలుసుకుందాం.
కథ 1980లో సియోల్ లో మొదలవుతుంది. కిమ్ మాన్-సియోబ్ ఓ సాధారణ టాక్సీ డ్రైవర్. భార్యను కోల్పోయిన అతను తన చిన్న కుమార్తెను ఒంటరిగా పెంచుకుంటూ ఉంటాడు. అప్పులు, ఇంటి అద్దె వంటి సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాడు. ఓ రోజు గ్వాంగ్జుకు వెళ్లి తిరిగి వస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తారనే విషయం తెలుసుకున్న మాన్-సియోబ్, మరో డ్రైవర్ కంటే ముందే ఆ ప్రయాణికుడిని తన టాక్సీలో ఎక్కించుకుంటాడు. అతడే జర్మన్ జర్నలిస్ట్ జుర్గెన్ హింజ్‌పీటర్, పీటర్. గ్వాంగ్జులో జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమం గురించి ప్రపంచానికి నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో పీటర్ అక్కడికి వచ్చాడు.
అయితే గ్వాంగ్జు దగ్గరకు వెళ్లగానే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సైనిక ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి బలగాలను మోహరించి ఉంటుంది. నగరంలోకి వెళ్లే మార్గాలను అడ్డుకుంటూ, బయట ప్రపంచానికి సమాచారం చేరకుండా ప్రయత్నిస్తుంది. మాన్-సియోబ్‌కు మొదట రాజకీయాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. తనకు రావాల్సిన డబ్బు తీసుకుని తిరిగి వెళ్లిపోవాలనే అనుకుంటాడు. కానీ నగరంలోకి వెళ్లిన తర్వాత అతని కళ్లముందు జరుగుతున్న హింస అతని మనసును కదిలిస్తుంది.
విద్యార్థులు, సామాన్య ప్రజలపై సైన్యం దాడులు చేయడం… గాయపడిన వారిని స్థానిక టాక్సీ డ్రైవర్లు ప్రాణాలకు తెగించి ఆసుపత్రులకు తరలించడం అతడిని మార్చేస్తుంది. పీటర్ ఈ దారుణాలన్నింటినీ కెమెరాలో బంధిస్తాడు. మిలిటరీ తమపై నిఘా పెట్టడంతో అతడిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లడం మాన్-సియోబ్ కు అసలు సవాలుగా మారుతుంది. మొదట తన ప్రాణం, తన కూతురి గురించి ఆలోచించిన అతడు చివరికి మానవత్వం వైపు నిలబడతాడు. స్థానిక డ్రైవర్ల సహాయంతో పీటర్ ను, అతని కీలక ఫుటేజీని కాపాడేందుకు ప్రాణాలకు తెగిస్తాడు. మరి చివరికి ఆ హీరో ఆ జర్నలిస్ట్ ను కాపాడగలిగాడా ? అనేది తెలియాలంటే వాచ్ దిస్ మూవీ.
‘ఎ టాక్సీ డ్రైవర్’కు జాంగ్ హూన్ దర్శకత్వం వహించారు. సాంగ్ కాంగ్-హో, థామస్ క్రెట్ష్‌మన్, యూ హై-జిన్, ర్యూ జున్-యెల్ కీలక పాత్రల్లో నటించారు. 1980 గ్వాంగ్జు ప్రజాస్వామ్య ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కొరియన్ సినిమా చరిత్రలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. కొరియన్ ఆడియోతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.
Read Also: మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్