Romantic Revenge Thriller: ఇప్పటికే రివేంజ్ థ్రిల్లర్లు చాలానే చూసి ఉంటాం. కానీ శత్రువుపై పగ తీర్చుకోవడానికి అతని కూతురినే పెళ్లి చేసుకుని, అది కూడా ముందే గడువు నిర్ణయించుకుని ఒప్పందం కుదుర్చుకోవడం చాలా అరుదుగా కనిపించే కథాంశం. అలాంటి ఆసక్తికరమైన నేపథ్యంతో రూపొందిన టర్కిష్ సిరీస్ ‘అరఫ్తా (Arafta)’. ఇప్పటికే ఈ సిరీస్ ఓటీటీలో మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు రెండో సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రతీకారం, ప్రేమ, ఊహించని మలుపులతో సాగే ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో మంచి స్పందన అందుకుంటోంది. మరి ఈ కథలో అంత ప్రత్యేకత ఏమిటి ? ఎందుకు అందరూ ఈ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నారు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని హీరో నిర్ణయించుకుంటాడు. కానీ అతను ఎంచుకున్న మార్గం మాత్రం ఎవ్వరూ ఊహించనిది. శత్రువును నేరుగా ఎదుర్కొనే బదులు, అతని కూతురిని 187 రోజుల పాటు మాత్రమే ఉండే పెళ్లి ఒప్పందంలోకి తీసుకువస్తాడు. ఈ పెళ్లి ప్రేమ కోసం కాదు. తన శత్రువును మానసికంగా కుంగదీయడానికి, అతని కుటుంబాన్ని బ్రేక్ చేయడానికి వేసిన పెద్ద ప్లాన్ లో ఇదొక భాగం.
ఇక పెళ్లి జరిగింది మొదలు… ఆ ఇంట్లో ప్రతి రోజు ఒక మైండ్ గేమ్‌లా మారిపోతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండదు. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మొదట ద్వేషంతో మొదలైన ఈ బంధంలో ఊహించని భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. ఒకరిని మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఎన్నో రహస్యాలు బయటపడతాయి. అదే సమయంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కథను పూర్తిగా కొత్త మలుపు తిప్పుతాయి.
రెండో సీజన్‌లో హీరోయిన్ పాత్ర మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మొదటి సీజన్‌లో జరిగిన సంఘటనలకు భిన్నంగా, ఈసారి హీరో వేసే ప్రతి ఎత్తుకు ఆమె అదిరిపోయే సమాధానం చెబుతుంది. దీంతో ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్ తో సిరీస్ మరింత ఆసక్తికరంగా టర్న్ తీసుకుంటుంది. హీరో అనుకున్నట్లు ప్రతీకారం పూర్తవుతుందా ? లేక అతనే తన పన్నిన వలలో చిక్కుకుంటాడా ? 187 రోజుల ఒప్పందం పూర్తయ్యే సమయానికి వారి జీవితాలు ఎలా మారతాయి ? గతంలో జరిగిన ఆ విషాదం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్‌లో పెద్దల కోసమే అనేలా కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే మలుపులు తర్వాతి పార్ట్ ను వెంటనే చూడాలనిపించేలా చేస్తాయి.
‘అరఫ్తా’ సీజన్ 2 ప్రస్తుతం Amazon Prime Video ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. కావాలనుకుంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. మంచి రివేంజ్ థ్రిల్లర్లు, ఊహించని మలుపులు ఉన్న టర్కిష్ సిరీస్‌లు చూడాలకుంటే ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు. ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే, ఆ 187 రోజుల డీల్ ఎలా ముగుస్తుందో తెలుసుకునే వరకు ఆపలేరు.
Read Also: 10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో