Year Ender 2025 : ఓటీటీలలో ఈ ఏడాది ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో ఆయా ఓటీటీల్లో సొంతంగా నిర్మిస్తున్న ఒరిజినల్స్ హవా పెరిగింది. అందులోనూ ఇలాంటి వాటికి దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. మరి ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన బెస్ట్ ఒరిజినల్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.
‘ఇన్ యువర్ డ్రీమ్స్’ (In Your Dreams) అలెక్స్ వూ దర్శకత్వం వహించిన యానిమేటెడ్ అడ్వెంచర్-కామెడీ చిత్రం. 12 ఏళ్ల స్టీవీ, ఆమె తమ్ముడు ఎలియట్ కథ ఇది. ఇద్దరూ కలిసి కలల ప్రపంచంలోకి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు, శాండ్‌మ్యాన్‌ను తమకు పరిపూర్ణ కుటుంబాన్ని ఇవ్వమని అడుగుతారు మరి ఆ కల నెరవేరిందా ? అన్నది స్టోరీ. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌గా ఆస్ట్రా ఫిల్మ్ అవార్డు నామినేషన్‌ను సంపాదించింది ఈ మూవీ.
కేథరిన్ బిగెలో దర్శకత్వం వహించిన అపోకలిప్టిక్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎ హౌస్ ఆఫ్ డైనమైట్’ (A House of Dynamite) , తెలియని శత్రువు అమెరికాపై ప్రయోగించబోయే క్షిపణి దాడి చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. అన్నీ దేశాల ప్రభుత్వాలు, సైనిక అధికారులకు పరిస్థితిని ఎదుర్కోవడానికి సమయం దొరకకపోవడంతో, ప్రత్యర్థిని గుర్తించడానికి కష్టపడుతుంటారు. మరి ఆ పరిస్థితిని ఎలా దాటారు అన్నది కథ. ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ కొన్ని రాజకీయ వివాదాలను సృష్టించినప్పటికీ, సాంకేతిక విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ… ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
గిల్లెర్మో డెల్ టోరో రచించి, దర్శకత్వం వహించి , నిర్మించిన మూవీ ‘ఫ్రాంకెన్‌స్టైయిన్’ (Frankenstein). 1818లో మేరీ షెల్లీ రాసిన నవల ఆధారంగా రూపొందించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రం డాక్టర్ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైయిన్ ( ఆస్కార్ ఐజాక్ ) అనే తెలివైన, అహంకార శాస్త్రవేత్త కథ. అతను చనిపోయిన వారిలో ఒక్కొక్కరిలో ఒక్కో పార్ట్ ను తీసి, చివరికి ఓ ప్రాణికి ప్రాణం పోస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నది కథ.
గీతా గాంభీర్ దర్శకత్వం వహించి , నిర్మించిన ‘ది పర్ఫెక్ట్ నైబర్’ (The Perfect Neighbor) అనేది 2023లో ఫ్లోరిడాలోని ఒకాలాలో జరిగిన అజికే ఓవెన్స్ హత్య గురించిన డాక్యుమెంటరీ చిత్రం . ఈ డాక్యుమెంటరీలో ఎక్కువగా బాడీక్యామ్ ఫుటేజ్, కాల్ ఆర్కైవ్‌లను ఉపయోగించి , సుసాన్ లూయిస్ లోరిన్జ్ తన పొరుగున ఉన్న ఓవెన్స్‌ను కాల్చి చంపిన విషాద సంఘటనకు దారితీసిన సంఘటనలను చూపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన అత్యుత్తమ డాక్యుమెంటరీలలో నిస్సందేహంగా ఇది కూడా ఒకటి. ఈ చిత్రం 2025 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయ్యి, బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకుంది.
మాగీ కాంగ్మరియుక్రిస్ అప్పెల్హాన్స్దర్శకత్వం వహించి, సహ రచయితగా రాసిన యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం KPop Demon Hunters. రాక్షసులతో పోరాడే K-పాప్ గర్ల్ గ్రూప్ మధురమైన కథ, అద్భుతమైన యానిమేషన్, సౌండ్‌ట్రాక్ ల సమ్మేళనం ఈ మూవీ. కొరియన్ పురాణాలు, కె-పాప్, అనిమేల నుండి ప్రేరణ పొందిన కెపాప్ డెమన్ హంటర్స్ నెట్‌ఫ్లిక్స్ లోనే అత్యధికంగా వ్యూస్ కొల్లగొట్టిన మూవీ. గ్రామీ అవార్డులలో భారీ సంఖ్యలో నామినేషన్లను పొందింది.