BSNL Plans: ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 107 ప్లాన్ వ్యాలిడిటీని మరోసారి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్లాన్ ధరలో కానీ, వినియోగదారులకు ఇచ్చే ప్రయోజనాల్లో (Benefits) కానీ ఎలాంటి మార్పులను చేయకపోవడం గమనార్హం.
BSNL రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని తాజాగా 20 రోజులకు కుదించింది. గతంలో ఈ ప్లాన్ కాలపరిమితి 22 రోజులుగా ఉండేది. అంతకంటే ముందు 28 రోజులు.. ప్రారంభంలో అయితే 35 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లభించేది. బీఎస్ఎన్ఎల్ వరుసగా ఈ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గిస్తూ వస్తుండటంతో తక్కువ ధరలో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది నిరాశను కలిగిస్తోంది.
రూ.107 ప్లాన్ వ్యాలిడిటీ తగ్గినా ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులను బీఎస్ఎన్ఎల్ చేయలేదు. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ మాట్లాడుకోవడానికి మొత్తం 200 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ ను ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు పొందొచ్చు. డేటా విషయానికి వస్తే.. ప్లాన్ మొత్తానికి కలిపి 3GB హై స్పీడ్ డేటా యూజర్లకు లభించనుంది. ఒకవేళ 3GB డేటా పరిమితి పూర్తైనా.. ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. 40 Kbps వేగంతో అపరిమితంగా డేటాను వాడుకోవచ్చని పేర్కొన్నాయి.
రూ.107 ప్లాన్ ద్వారా ఉచితంగా అందించే 200 నిమిషాల టాక్‌టైమ్ ముగిసిన తర్వాత కూడా యూజర్లు కాల్స్ చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక నిమిషం కాల్ మాట్లాడటానికి రూ. 1.. బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. అదే ఎస్టీడీ కాల్స్ అయితే నిమిషానికి రూ.1.30 బీఎస్ఎన్ఎల్ వసూలు చేస్తుంది. వీడియో కాల్స్ కు నిమిషానికి రూ.2, లోకల్ ఎస్ఎంఎస్ 80 పైసలు, నేషనల్ మెసేజ్ కు రూ.1.20 ఛార్జ్ చేయనున్నారు.
Also Read: ఉక్కపోతతో నిద్ర పట్టట్లేదా? ఏసీ ఉన్నా, లేకున్నా.. ఈ ట్రిక్స్‌తో హాయిగా పడుకోవచ్చు!
రూ. 107 ప్లాన్ తో పాటు BSNL తన రూ. 197 ప్లాన్ వ్యాలిడిటీని కూడా తగ్గించింది. గతంలో 42 రోజుల వ్యాలిడిటీని అందించిన ఈ ప్లాన్‌ను.. ఇప్పుడు 35 రోజులకు కుదించింది. అయితే ఇందులో డేటాను మాత్రం 4GB నుండి 5GB కి పెంచింది. ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్స్ వ్యాలిడిటీని తగ్గించినప్పటికీ.. జియో, ఎయిర్ టెల్, వీఐ వంటి ప్రైవేటు టెలికాం సంస్థల టారిఫ్స్ తో ఇంకా ఇవి చౌకగానే ఉండటం విశేషం.
Also Read: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి టోకరా.. రూ. 24 కోట్లు స్వాహా!