Energy Drinks Side Effects: ఈ రోజుల్లో చాలామంది టీనేజర్లు, యువత చేతుల్లో ఎనర్జీ డ్రింక్స్ కామన్‌గా కనిపిస్తున్నాయి. చదువుల్లో ఏకాగ్రత పెంచుకోవడానికో, అలసట నుంచి ఉపశమనం కోసమో వీటిని ఎగబడి తాగుతున్నారు. కానీ, ఈ డ్రింక్స్ ఇచ్చే తక్షణ శక్తి వెనుక పెద్ద ఆరోగ్య ముప్పు దాగుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువని వారు స్పష్టం చేస్తున్నారు.
ఎనర్జీ డ్రింక్స్ తాగిన వెంటనే ఒంట్లోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ, ఇది కేవలం అందులోని భారీ కెఫిన్ వల్ల శరీరం చూపే తాత్కాలిక స్పందన మాత్రమే. ముంబైలోని హీరానందని హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ విమల్ పహూజా ప్రకారం.. వీటిని తాగడం వల్ల గుండె వేగం పెరగడం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ఆ తర్వాత శరీరం ఒక్కసారిగా నీరసించిపోతుంది.
చాలామంది తల్లిదండ్రులు ఎనర్జీ డ్రింక్స్‌ను మామూలు కూల్ డ్రింక్స్‌లాగే అనుకుంటారు. కానీ వీటిలో కెఫిన్ పరిమాణం చాలా ఎక్కువ. సాధారణంగా టీనేజర్లు రోజుకు 100 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీతో సమానం. అయితే, కొన్ని ఎనర్జీ డ్రింక్స్ క్యాన్లలో ఏకంగా 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటోంది. ఇది సిఫార్సు చేసిన మోతాదు కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ. ఇది పెరిగే పిల్లల నరాల వ్యవస్థపై, గుండెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది.
Also Read: గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?
మధ్యాహ్నమో, సాయంత్రమో తాగే ఎనర్జీ డ్రింక్ ప్రభావం రాత్రి పడుకునే వరకు ఉంటుంది. దీనివల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. నిద్ర చెడిపోవడంతో మరుసటి రోజు ఉదయం మళ్లీ అలసట, ఏకాగ్రత లోపించడం మొదలవుతుంది. ఆ అలసటను పోగొట్టుకోవడానికి టీనేజర్లు మళ్లీ మరో ఎనర్జీ డ్రింక్ ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇదొక విషవలయంగా మారి, వారిని మానసిక ఒత్తిడికి, చిరాకుకు గురిచేస్తోంది.
టీనేజ్ అనేది పిల్లల శారీరక ఎదుగుదలకు అత్యంత కీలకమైన సమయం. ఈ వయసులోనే ఎముకలు బలంగా తయారవుతాయి. అయితే, మితిమీరిన కెఫిన్ వల్ల శరీరం క్యాల్షియాన్ని సరిగ్గా గ్రహించలేదు. దీనివల్ల భవిష్యత్తులో ఎముకల బలహీనత వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మార్కెట్లో వీటిని కేవలం లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్‌లా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి.. యువతను దృష్టిలో పెట్టుకుని వీటి అమ్మకాలపై కఠిన నిబంధనలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!