Fake WhatsApp App: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సప్ తప్పనిసరిగా ఉంటుంది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక అవసరం కోసం మనం వాట్సప్‌ను వాడుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ పాపులర్ యాప్ పేరుతో ఒక పెద్ద మోసం బయటపడింది. గూగుల్ ప్లేస్టోర్‌లో అసలైన వాట్సప్ మాదిరిగానే ఉండే ఒక నకిలీ యాప్ దర్శనమిస్తోంది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే.. ఈ ఫేక్ యాప్‌ను ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మందికి పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్లేస్టోర్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఇది స్పాన్సర్డ్ యాప్‌గా మొదటి స్థానంలో కనిపిస్తుండటంతో చాలామంది నిజమైన యాప్ అనుకుని పొరబడుతున్నారు.
ఈ నకిలీ యాప్ చూడటానికి ఎంత సహజంగా ఉందంటే.. అసలైన వాట్సప్‌కి దీనికి తేడా కనిపెట్టడం చాలా కష్టం. లోగో, లోపల ఉండే స్క్రీన్షాట్లు, యాప్ వివరణ అన్నీ ఒరిజినల్ యాప్‌లాగే డిజైన్ చేశారు. సెర్చ్ చేసినప్పుడు అందరికంటే పైన కనిపించడంతో జనాలు నిజమైనదే అనుకుని డౌన్లోడ్ చేస్తున్నారు. ఇటీవలే క్రోమ్ బ్రౌజర్ పేరుతో కూడా ఇలాంటి ఒక నకిలీ యాప్ రావడం, దాన్ని లక్ష మందికి పైగా డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం.
Also Read: స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్డేట్!
మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఫేక్ యాప్‌ను సులభంగా పసిగట్టవచ్చు. అసలైన వాట్సప్ WhatsApp LLC అనే డెవలపర్ పేరుతో ఉంటుంది. దానికి వేల కోట్లలో డౌన్లోడ్లు, ఎడిటర్స్ ఛాయిస్ బ్యాడ్జ్ ఉంటాయి. కానీ ఈ ఫేక్ యాప్ Agment Assets sallu అనే కొత్త డెవలపర్ పేరుతో కనిపిస్తోంది. అలాగే ప్లేస్టోర్‌లోని కొన్ని ఫీచర్ల వల్ల ఈ యాప్‌కి యూజర్ రివ్యూలు కూడా కనిపించకుండా పోతున్నాయి.
ఈ నకిలీ యాప్ వల్ల మీ ఫోన్ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత సమాచారం, చాటింగ్ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెర్చ్‌లో పైన కనిపించినంత మాత్రాన అది సురక్షితమైన యాప్ అని నమ్మడానికి వీల్లేదు. ఇటువంటి థర్డ్ పార్టీ యాప్‌లను వాడితే వాట్సప్ మీ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది.
మీ ఫోన్లో ఈ నకిలీ యాప్ ఉంటే వెంటనే దాన్ని డిలీట్ చేయండి. ఎప్పుడైనా వాట్సప్ డౌన్లోడ్ చేసుకునే ముందు డెవలపర్ పేరు WhatsApp LLC ఉందో లేదో సరిచూసుకోండి. సందేహం ఉంటే వాట్సప్ అధికారిక వెబ్సైట్ ద్వారా ప్లేస్టోర్‌కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవడం చాలా సురక్షితమైన మార్గం.
Also Read: యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?