మరణం.. ఈ లోకాన్నే కాదు, మనసుకు నచ్చిన ఆప్తులు, స్నేహితులను సైతం దూరం చేస్తుంది. అప్పటి వరకు మనతో ఉన్న వ్యక్తులను మాయం చేస్తుంది. వాళ్లు వదిలి వెళ్లే్ జ్ఞాపకాలు.. మనసులో మెదలుతూ భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. వారు మళ్లీ మనతో ఉంటే బాగున్ను.. ఎప్పటిలాగానే మనతో కలిసి కబుర్లు చెబితే బాగున్ను.. అని అనిపిస్తుంటుంది. అయితే.. నేటి టెక్నాలజీతో అది సాధ్యమేనని అంటున్నారు సాంకేతిక నిపుణులు. అదెలా? సాధ్యం.. అయినా చనిపోయినవారు మళ్లీ బతకడం ఏంటీ? కబుర్లు చెప్పడం ఏమిటీ అని అనుకుంటున్నారా? అయితే, రానున్న 10 ఏళ్లలో అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవల్సిందే.
మీకు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసే అలవాటు ఉంటే.. ఈ టెక్నాలజీ మీకు భలే నచ్చేస్తుంది. ఇన్నాళ్లూ సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుతం మీ కళ్ల ముందు ఉంటుంది. అయితే, ఇది చూసేందుకు కాస్త వేచి చూడక తప్పదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఏఐని సరైన పద్ధతిలో వాడితే.. చనిపోయిన వ్యక్తులతో కలిసి జీవించడం సాధ్యమవుతుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న యాప్‌లు, గ్యాడ్జెట్లు మనం కోల్పోయిన వ్యక్తులను కళ్ల ముందు ఉంచుతాయి. ఈ మేరకు కెనడాకు చెందిన ప్రముఖ నటుడు కాలమ్ వర్థీ, అతడి టీమ్ ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే.
చనిపోయిన వ్యక్తులతో తిరిగి మాట్లాడటం, వారితో కలిసి జీవించడం సాధ్యమా, కాదా అనే విషయంపై నటుడు కాలమ్ వర్థీకి ఓ ఆలోచన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన టీమ్‌తో కలిసి 2wai అనే యాప్‌ను క్రియేట్ చేశాడు. 2wai అంటే రెండు వైపులా అని అర్థం. దీన్ని ఐఫోన్‌లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఇది ఇప్పటికే మరణించిన వ్యక్తులను తిరిగి తీసుకురాలేదు. వారికి సంబంధించిన ఏమైనా వీడియోలు ఉన్నట్లయితే తప్పకుండా సాధ్యం అవుతుంది. కానీ, నిజంగా చనిపోయిన వ్యక్తులను ఈ యాప్ బతికించలేదు. జస్ట్ అనుకరిస్తుంది అంతే. ఈ యాప్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఒక డిజిటల్ కాపీని క్రియేట్ చేస్తుంది. దీన్నే హోలో అవతార్ (Holo Avatar) అని అంటారు. ఇది అచ్చం చనిపోయిన వ్యక్తిని పోలి ఉంటుంది. మీరు అల్రెడీ రికార్డు చేసిన ఆ వ్యక్తిని ఈ ఏఐ అనుకరిస్తుంది. ఆ వ్యక్తి మాట్లాడే తీరు, జోకులు, చిరునవ్వులు, భావాలు ప్రతి ఒక్కటీ అది కాపీ చేస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకుని.. అచ్చం ఆ వ్యక్తిలాగే రెస్పాండ్ అవుతుంది. ఇది క్రియేట్ చేయడం కోసం మీరు తప్పకుండా ఆ వ్యక్తికి సంబంధించిన 3 నిమిషాల వీడియో ఉండాలి. చనిపోయిన వ్యక్తుల వీడియోను ఎలాగో కొత్తగా క్రియేట్ చేయలేం. కాబట్టి.. వారివి పాత వీడియోలు ఏమైనా ఉంటే.. అవన్ని మిక్స్ చేసి ఈ యాప్‌కు ఇవ్వొచ్చు. లేదా బతికి ఉండగానే ఆ 3 నిమిషాల వీడియోను రికార్డు చేసుకుని ఉంచుకోవడం బెటర్. భవిష్యత్తులో ఉపయోగపడొచ్చు.
ఈ రోజుల్లో మనుషులను పోలీన మనుషుల వీడియోలను, ఫొటోలను ఏఐ ఏ విధంగా క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఈ 2wai యాప్ కూడా అలాగే పనిచేస్తుంది. చనిపోయిన వ్యక్తి హవభావాలను అచ్చు గుద్దినట్లు దింపేస్తుంది. మీరు నిజంగానే ఆ వ్యక్తితో మాట్లాడుతున్న భావన కలిగిస్తుంది. ఇందులో ప్రతి ఒక్కటీ ప్రోగ్రామింగ్ చేయబడుతుంది. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు ఆ హోలో అవతార్ (చనిపోయిన వ్యక్తి రూపం) మీకు సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం ఈ అవతార్ కేవలం మీ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ మీదే ఉంటుంది. వీడియో, వాయిస్ మీద శిక్షణ పొందిన కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇదంతా చేస్తుంది.
ప్రస్తుతం ఈ అవతార్‌లు మొబైల్, టీవీ స్క్రీన్లలోనే కనిపిస్తాయి. దానివల్ల వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే.. భవిష్యత్తులో అవి నిజమైన మనిషిలా మీ పక్కనే నిలబడినా ఆశ్చర్యపోవద్దు. త్వరలో 3D టెక్నాలజీ ద్వారా స్క్రీన్లలో ఉండే అవతార్‌లు మనతోనే మన చుట్టూ.. ఇంట్లో షికారు చేస్తున్నట్లుగా రూపొందించడానికి సన్నహాలు చేస్తున్నారు. అదే అచ్చం మీరు చూసే సైన్స్ ఫిక్షన్ సినిమాల తరహాలో. వాల్యూమెట్రిక్ డిస్‌ప్లేలు, రియల్ టైమ్ హోలోగ్రామ్‌లు.. 3డి చిత్రాలను నిజమైన వ్యక్తులు మన చుట్టూ తిరుగుతున్నట్లు అవతార్‌లను మార్చేయగలవు. అందరినీ కోల్పోయి ఒంటరిగా జీవించే వ్యక్తులకు ఇది ఒక వరంలా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చనిపోయిన వ్యక్తుల అవతార్‌లు కేవలం వారి రూపాన్ని, హవభావాలను మాత్రమే కలిగి ఉంటాయి. వారి నిజమైన ఎమోషన్స్‌ను ప్రదర్శించలేవు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఎలా స్పందించాలని ఉంటుందో అలాగే చేస్తాయి. అలాగే మాట్లాడతాయి, సమాధానాలు ఇస్తాయి. రానున్న ఐదేళ్లలో తప్పకుండా దీని గురించి మరో అప్ డేట్ వస్తుంది. మళ్లీ అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం.
Also Read: చంద్రుడిపై మగాళ్ల వీర్యం ఉత్తి నురగేనా? ఆస్ట్రేలియా స్టడీలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడి