Iron cooler: ఎండల నుంచి రిలాక్స్ అవ్వడానికి చాలామంది కూలర్లను ఉపయోగిస్తారు. అయితే.. ఒక్కోసారి ఐరన్ కూలర్ బాడీని తాకినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నీటితో సంబంధం ఉన్న పరికరం కాబట్టి.. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. వైరింగ్ లోపాలు, ఎర్తింగ్ లేకపోవడం లేదా మోటార్ వైండింగ్‌లో సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. మీ ఐరన్ కూలర్ షాక్ రావడానికి అసలు కారణాలు ఏంటి ? ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన ఎర్తింగ్ లేకపోవడం:
మెటల్ బాడీ ఉన్న ఏ ఎలక్ట్రికల్ పరికరానికైనా ఎర్తింగ్ తప్పనిసరి. మీ ఇంటి వైరింగ్‌లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే.. మోటార్ నుంచి లీక్ అయ్యే కరెంట్ కూడా కూలర్ బాడీపై నిలిచిపోతుంది. దీని వల్ల కూలర్ బాడీని తాకగానే షాక్ కొడుతుంది.
వైర్ల ఇన్సులేషన్ దెబ్బతినడం:
కూలర్ లోపల వైర్లు నీటిలో ఉండటం లేదా వేడి వల్ల వాటిపై ఉండే ప్లాస్టిక్ కోటింగ్ కరిగిపోవచ్చు. ఇలా తెగిపోయిన వైర్లు ఐరన్ బాడీకి తగిలినప్పుడు కరెంట్ ప్రవహిస్తుంది.
వాటర్ పంప్ సమస్య:
చాలా సందర్భాల్లో కూలర్‌లోని వాటర్ పంప్ పాతబడటం వల్ల దాని లోపలికి నీరు చేరి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ కరెంట్ నీటి ద్వారా కూలర్ మొత్తం వ్యాపిస్తుంది.
తేమ, తుప్పు:
కూలర్ బాడీకి తుప్పు పట్టడం వల్ల వైరింగ్ పాయింట్ల వద్ద లీకేజీలు ఏర్పడతాయి. అలాగే.. స్విచ్ బోర్డ్ వద్ద తేమ ఉన్నా కరెంట్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
పరిష్కార మార్గాలు, జాగ్రత్తలు:
త్రీ-పిన్ ప్లగ్ వాడండి: కూలర్ కనెక్షన్ కోసం ఎప్పుడూ నాణ్యమైన త్రీ-పిన్ ప్లగ్ మాత్రమే వాడండి. మూడవ పిన్ (పెద్దది) ఎర్తింగ్‌కు సంబంధించింది. ఇది లీకేజీ కరెంట్‌ను భూమిలోకి పంపుతుంది.
వైరింగ్ చెక్: ప్రతి సీజన్ ప్రారంభంలో కూలర్ లోపలి వైర్లను క్షుణ్ణంగా చెక్ చేయండి. ఎక్కడైనా వైర్ బయడకు కనిపిస్తే.. ఉంటే వెంటనే టేప్ వేయండి లేదా వైరు మార్చండి.
Also Read: పవర్ బ్యాంక్ వాడుతున్నారా? పేలడానికి ముందు కనిపించే ఈ 5 సంకేతాలు ఇవే
చెక్క స్టాండ్ లేదా రబ్బర్ మ్యాట్: కూలర్‌ను నేరుగా నేలపై ఉంచకుండా.. చెక్క స్టాండ్‌పై లేదా మందపాటి రబ్బర్ మ్యాట్‌పై ఉంచండి. ఇది ఎర్త్ కాంటాక్ట్‌ను తగ్గించి షాక్ తీవ్రతను తగ్గిస్తుంది.
మెయింటెనెన్స్: పాతబడిపోయిన వాటర్ పంప్‌లను మార్చండి. కూలర్ స్విచ్‌లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూడండి.
ప్లగ్ తీసివేసి నీరు నింపండి: కూలర్‌లో నీరు నింపేటప్పుడు లేదా శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా ప్లగ్ తీసివేయాలి. స్విచ్ ఆఫ్ చేసినా కొన్నిసార్లు కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
కరెంట్ పరికరాలను వాడేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది ప్రమాదకరం. మీ కూలర్ స్వల్పంగా షాక్ ఇస్తున్నా..వెంటనే ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి రిపేర్ చేయించుకోండి. సరైన వైరింగ్ , సరైన ఎర్తింగ్ ఉంటేనే కూలర్ వాడకం ప్రమాదాలను నివారిస్తుంది.