Advertisement Policy: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్‌లో అక్రమ అడ్వర్ టైజ్ మెంట్ దందాకు చెక్ పడనుంది. రీజియన్ పరిధిలో కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీ ఆదేశాలను తీసుకువచ్చిన సర్కారు అమల్లో చేసిన జాప్యం కారణంగా రీజియన్ పరిధిలో ప్రస్తుతం ఈ దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ ఎట్టకేలకు కొత్త పాలసీకి మోక్షం కలిగింది. ఈ పాలసీని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవమైన వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు సర్కారు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అడ్యర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ కూడా ఈ నెల 20వ తేదీన కీలకమైన సమావేశాన్ని నిర్వహించి, కొత్త పాలసీ అమలుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇటీవలే రెండు నెలల క్రితం కొత్త పాలసీ విధానంపై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తూ జీఓ సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్‌ల పరిధిలో ఒకే విధానం అమలులోకి రానుంది. ఇదే పాలసీని మున్ముందు రాష్ట్ర స్థాయిలో అమలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఎలాంటి అనుమతుల్లేకుండా కొనసాగుతున్న ఈ అడ్వర్ టైజ్ మెంట్ దందాకు సర్కారు ఫుల్ స్టాప్ పెట్టనుంది. కొత్త పాలసీ ప్రకారం అన్ని ప్రకటనలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య, భౌగోళిక గుర్తింపు విధానం తప్పనిసరి చేయనున్నారు. అక్రమ ప్రకటనలను ముందస్తు నోటీసు లేకుండానే తొలగించే అధికారాలను ఈ కొత్త పాలసీలో మున్సిపల్ కమిషనర్లకు కేటాయించనున్నారు. పురాతన కట్టడాలు, విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద ప్రకటనలకు పూర్తిగా నిషేధం అమలు కానుంది. దీనికి తోడు రద్దీగా ఉండే జంక్షన్లలో కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా వీటి ఏర్పాటుకు కొత్త పాలసీలో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం. రాత్రి పదకొండు గంటల తర్వాత జిగేల్ మంటూ వెలుగులు వెదజల్లే డిజిటల్ ప్రకటనలను నిలిపివేయాలని కూడా కొత్త పాలసీలో నిబంధనలు పొందుపర్చినట్లు తెలిసింది. హైదరాబాద్ చారిత్రక నగర శోభ పరిరక్షణతో పాటు ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా కొత్త ప్రకటనల విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు సర్కారు సిద్దమైనట్లు సమాచారం.
రెండు నెలల క్రితం కొత్త పాలసీపై మార్చి మొదటి వారంలో ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో ఒకే విధానాన్ని అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. నగర చారిత్రక శోభ, ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రకటనల వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ సమగ్ర మార్గదర్శకాలు రూపొందించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు పలు సార్లు సచివాలయ స్థాయిలో మూడు కార్పొరేషన్ల కమిషనర్లతో ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి మారదర్శకాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత మార్గదర్శకాలు, సర్క్యులర్లన్నీ రద్దు కూడా చేశారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ఇకపై ఏ ప్రకటన అయినా ప్రకటనల అడ్వర్ టైజ్ మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ఏఆర్సీ) అనుమతిస్తేనే హోర్డింగ్, యునిపోల్స్ వంటి అడ్వర్ టైజ్ మెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులతో ఏర్పాటైన ఏఆర్సీ కమిటీ ఏర్పాటు కానుంది.
Also read: రోడ్లపై ఉన్న బండి దగ్గర ఫుడ్ తింటున్నారా.. జీహెచ్ఎంసీ కొత్త రూల్స్..!
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ప్రతినిధులు, మూడు మున్సిపల్ కార్పొరేషన్‌ల కమిషనర్లు, ట్రాఫిక్ పోలీసులు, మెట్రో రైలు, రవాణా శాఖ, పర్యాటక శాఖ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా కొనసాగనున్నారు. కొత్త పాలసీలోని నియమ నిబంధనల ప్రకారం హైదరాబాద్ మహా నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి, అత్యధిక వ్యాపార విలువ ఉన్న ప్రాంతాలను ప్రత్యేక జోన్‌గా, అభివృద్ధి చెందుతున్న వ్యాపార ప్రాంతాలను రెండో జోన్‌గా, మిశ్రమ వినియోగ ప్రాంతాలను మూడో జోన్‌గా, నివాస ప్రాంతాలను నాలుగో జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్‌కు వేర్వేరు ఫీజులు, అదనపు చార్జీలు సైజును బట్టి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న 10 వేలకు పైగా అనుమతులతో ఉన్న అడ్వర్ టైజ్ మెంట్లు కొత్త పాలసీ నిబంధనల ప్రకారం అదనంగా మరో నాలుగు వేల వరకు ప్రకటనలకు అనుమతులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ, మున్సిపల్ స్థలాల్లో కొత్త పాలసీ ప్రకారం ఏర్పాటు చేయనున్న అడ్వర్ టైజ్ మెంట్లను ఓపెన్ టెండర్ల ప్రక్రియ ద్వారానే కేటాయించనున్నారు. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి అనుమతులు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ పాలసీలో నిబంధనలను పెట్టారు. సామాజిక సందేశాలు, ప్రభుత్వ పథకాల ప్రచారానికి కనీసం పది శాతం ప్రకటన స్థలాన్ని కేటాయించనున్నారు. వ్యక్తిగత భవనాలపై ఏర్పాటు చేసే స్వీయ ప్రకటనలు, తాత్కాలిక బ్యానర్లు, గోడ చిత్రాలు, వాహనాలపై ప్రకటనలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వీటి అనుమతుల కాలపరిమితి గరిష్టంగా ఐదు సంవత్సరాలుగా నిర్ణయించారు. అనుమతి పొందిన ప్రతి ప్రకటనపై ప్రత్యేక గుర్తింపు కోడ్ ను కన్పించేలా ఏర్పాటు చేయనున్నారు. ఆ గుర్తు ద్వారా అనుమతి సంఖ్య, గడువు, విభాగం, పరిమాణం వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి.
Also read: ఇరిగేషన్ శాఖలో బదిలీల కలకలం.. ఆ రెండు విభాగాలనే ఎందుకు టార్గెట్..?
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనలను ముందస్తు నోటీసు అంటూ ఏమీ లేకుండా తొలగించే అధికారం మున్సిపల్ కమిషనర్లకు కేటాయించారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి వార్షిక రుసుము కంటే మూడు రెట్లు జరిమానా విధించనున్నారు. మళ్లీ ఉల్లంఘిస్తే ప్రకటనదారులను నిషేధ జాబితాలో చేర్చేలా ఈ పాలసీలో రూల్స్ పొందుపరిచారు. పురాతన కట్టడాలు, ప్రార్థనా స్థలాలు, ఉద్యానవనాలు, నీటి వనరులు, విద్యాసంస్థలు, స్మశానాల వద్ద ప్రకటనలకు పూర్తిగా నిషేధించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ప్రకటనలకు అనుమతి లభించదు. వంద అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రహదారులపైనే భారీ హోర్డింగ్‌లకు అనుమతి ఇవ్వనున్నారు. రెండు భారీ ప్రకటనల మధ్య కనీస దూరం తప్పనిసరి చేశారు. వారసత్వ కట్టడాల సమీపంలో భారీ ప్రకటనలకు అనుమతించరు.
కొత్త అడ్వర్ టైజ్ మెంట్ పాలసీకి సంబంధించి సర్కాలు మార్చి నెలలో జారీ చేసిన జీవో 84 ప్రకారం ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లు, వెలుగు, జిలుగుల ప్రకటనల బోర్డులకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు. రాత్రి పదకొండు గంటల తర్వాత వెలుగులను నిలిపివేసేలా రూల్స్ మార్చారు. రద్దీ జంక్షన్ల సమీపంలో కదిలే దృశ్యాల ప్రదర్శనకు అనుమతించరు. బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ కేంద్రాలు, వీధి దీపాలు వంటి ప్రజా సదుపాయాలపై ప్రకటనలకు కూడా కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. అడ్వర్ టైజ్ మెంట్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై ప్రత్యేకంగా ఏఆర్సీ కమిటీ దృష్టి సారించనుంది. గాలి, వర్షం, భూకంప పరిస్థితులను తట్టుకునేలా నిర్మాణాలుండేలా ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. స్ట్రక్చరల్ స్టిబిలిటీకి సంబంధించి టెక్నికల్ గా ధృవీకరించే సర్టిపికెట్లు ఏజెన్సీలు తప్పక సమర్పించేలా నిబంధనలను సవరించారు. కొత్త విధానం అమలుతో నగరంలో అక్రమ హోర్డింగ్‌లకు చెక్ పడటంతో పాటు ఆదాయం పెంచుకునేందుకు రూపొందించిన ఈ పాలసీ ఎంత వరకు ఆశించిన స్థాయిలో అమలవుతుందో? వేచి చూడాలి.
Also read: వ్యూహం ఫలించింది.. 15వ నౌక సేఫ్.. భారత్‌కు ఇక ఇంధన కష్టాలు తీరినట్టే?