Induction Safety: సాధారణంగా ఇంట్లో పసిపిల్లలు ఉంటే.. అడుగడుగునా కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆహారం తినిపించాలి? ఎంత పెట్టాలి? అసలు ఏ పాత్రలో వండాలి? ఇలా ప్రతి చిన్న విషయంలోనూ తల్లులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వంటింట్లో స్టవ్ వెలిగించామంటే చాలు.. పిల్లలు ఎక్కడ అటు వస్తారో, ఆ మంటను ఎక్కడ ముట్టుకుంటారో అని ఒకటే కంగారు పడిపోతుంటారు.
అయితే ఈ మధ్య కాలంలో చాలామంది గ్యాస్ కొరత వల్లనో లేదా వాడకం సులభంగా ఉంటుందనో ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారు. ఈ ఇండక్షన్ మీద వండిన ఫుడ్ మా పిల్లలకి పెట్టొచ్చా? ఇది సేఫేనా? అనే అనుమానం చాలామందిలో ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, గ్యాస్ స్టవ్ కంటే ఇండక్షన్ మీద వండిన ఆహారమే పిల్లలకు బెటర్ అంటున్నారు నిపుణులు.
గ్యాస్ స్టవ్ అనుకోండి.. అక్కడ మంట కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు పొరపాటున అటు వెళ్లినా లేదా వాళ్ల బట్టలు తగిలినా చాలా ప్రమాదం. కానీ ఇండక్షన్ స్టవ్‌లో అసలు మంట అన్నదే ఉండదు. ఇది కేవలం గిన్నెను మాత్రమే వేడి చేస్తుంది తప్ప స్టవ్ మొత్తాన్ని కాదు. వంట చేసేటప్పుడు గిన్నె పక్కన స్టవ్ మీద చేయి వేసినా ఎలాంటి వేడి తగలదు. వంట పూర్తి కాగానే స్టవ్ ఉపరితలం కూడా చాలా త్వరగా చల్లారిపోతుంది. ఇది పసిపిల్లలున్న ఇళ్లలో చాలా పెద్ద ప్లస్ పాయింట్.
Also Read: వంట మనిషి అక్కర్లేదు, వడ్డించనవసరం లేదు.. అంతా ఈ మెషీన్ చూసుకుంటుంది!
చిన్న పిల్లల ఊపిరితిత్తులు చాలా సున్నితంగా ఉంటాయి. గ్యాస్ స్టవ్ వాడినప్పుడు మనకు తెలియకుండానే నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి వాయువులు విడుదలవుతాయి. దీనివల్ల కొందరు పిల్లలకు దగ్గు లేదా శ్వాస ఇబ్బందులు రావచ్చు. ఇండక్షన్ వాడితే అలాంటి గ్యాస్ భయాలు ఉండవు. వంటింట్లో గాలి కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. కాబట్టి వాళ్ల ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని చెప్పొచ్చు.
స్టవ్ మీద మంట లేదు కదా అని అశ్రద్ధగా ఉండకూడదు. స్టవ్ ఉపరితలం చల్లగా ఉన్నా, దాని మీద ఉన్న కూర గిన్నె లేదా పాలు కాచే గిన్నె మాత్రం చాలా వేడిగా ఉంటుంది. పిల్లలు ఆ గిన్నెలను లాగకుండా ఉండాలంటే, ఎప్పుడూ లోపలి వైపు ఉన్న బర్నర్లను వాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే గిన్నె కాడలు ఎప్పుడూ బయటకు కాకుండా గోడ వైపు ఉండేలా తిప్పి ఉంచడం మర్చిపోవద్దు.
ఇప్పటి ఇండక్షన్ స్టవ్‌లలో ‘చైల్డ్ లాక్’ అనే ఆప్షన్ వస్తోంది. అది నొక్కేస్తే పిల్లలు వచ్చి బటన్లు నొక్కినా స్టవ్ ఆన్ అవ్వదు. అలాగే దీని మీద గిన్నె లేకపోతే స్టవ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇవన్నీ అమ్మలకి పెద్ద ఊరట ఇచ్చే విషయాలే. ఏదేమైనా వంట చేసేటప్పుడు పిల్లలను ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. కాకపోతే గ్యాస్ స్టవ్‌తో పోలిస్తే ఇండక్షన్ వాడటం వల్ల మనకు సగం టెన్షన్ తగ్గుతుందనేది మాత్రం అక్షర సత్యం.
Also Read: టీవీ బ్రాండ్ చూసి మోసపోతున్నారా? శాంసంగ్, ఫిలిప్స్‌లో ఏది వాల్యూ ఫర్ మనీ?